YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో హీటెక్కిన రాజకీయాలు

ఏపీలో హీటెక్కిన రాజకీయాలు
ఓ..అమ్మ….అక్క…చెల్లి…ఇదీ స్టోరీ…అని ఒక సినిమాలో చెబితే నవ్వుకున్నాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే ఇదే సీన్లు తరచూ కన్పిస్తున్నాయి. ఓ బుగ్గన…ఓ ఆకుల… ఇదీ స్టోరీ. వామ్మో ఏపీ భవన్.. ఇప్పుడు ఆ పేరు చెబితే నేతలకు దడ పుడుతోంది. బీజేపీ, వైసీపీ నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారన్న వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కలసి వెళుతున్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కాని అధికార తెలుగుదేశం పార్టీకి అస్త్రం మాత్రం దొరికింది. ఇక చంద్రబాబు అనుకూల మీడియా పదే పదే అదే ప్రసారాలను చూపిస్తూ జగన్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి లింకులివిగో అంటూ ఊదరగొట్టేస్తుంది.అయితే వాస్తవానికి ఏపీ భవన్ లో బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ దిగారని తెలుస్తోంది. ఆకుల సత్యనారాయణ బీజేపీ నేతల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి ఏపీ భవన్ లోని 101 నెంబర్ లో దిగారు. బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి కూడా ఏపీ భవన్ లోనే దిగారు. అయితే వీరిద్దరూ కలసి బీజేపీ జాతీయ నేతలను కలిసి చర్చించారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ చేస్తున్న అవినీతికి సంబంధించిన ఆధారాలను బీజేపీకి అందచేసేందుకే రాజేంద్రనాధ్ రెడ్డి వెళ్లారని టీడీపీ ఆరోపిస్తుంది. దీన్ని బట్టి బీజేపీ, వైసీపీ లాలూచీ రాజకీయాలు బయటపడుతున్నాయని టీడీపీ విమర్శిస్తోంది.బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పీఏసీ ఛైర్మన్. ఆయన గతంలోనూ పట్టిసీమలో 450 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పంపుల ఏర్పాటులో కూడా కిరికిరి జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా హంద్రీనీవా పనుల్లోనూ కాంట్రాక్టరుకు అదనపు మొత్తాన్ని చెల్లించారని బుగ్గన నేరుగానే చెబుతున్నారు. ఈనేపథ్యంలో బుగ్గన పర్యటన ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించింది. కాని తాను వ్యక్తి గత పనులపై వెళ్లానని బుగ్గన చెబుతున్నారు. తాము కలసిన మాట వాస్తవమే కాని, ఏ బీజేపీ జాతీయ నేత వద్దకు వెళ్లలేదని, ఇద్దరం ఎమ్మెల్యేలం కాబట్టి ఏపీ భవన్ లో ఎదురుపడినప్పుడు మాట్లాడుకున్నామని ఆకుల సత్యనారాయణ చెబుతున్నారు. మొత్తం మీద బుగ్గన ఢిల్లీ టూర్ టీడీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పడింది. దీంతో ఏపీభవన్ కు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు ఏపీ నేతలు. మొత్తం మీద బుగ్గన, బీజేపీ కలయిక ఒక పెద్ద స్టోరీకే దారితీసిందని చెబుతున్నారు వైసీపీ నేతలు. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు కలుసుకుంటే ఇక అంతేనా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ కలయికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆరా తీయడం విశేషం.  నిజంగా అవినీతికి సంబంధించిన ఆధారాలు సంపాదించాలంటే బుగ్గన ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చిటెకలో సేకరించగలదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Related Posts