YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

లోకసభ పై దృష్టిపెట్టిన అఖిలేష్

లోకసభ పై దృష్టిపెట్టిన  అఖిలేష్
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన లోక్ సభ ఎన్నికలపై కన్నేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దీర్ఘకాల సమయం ఉండటంతో ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం విశేషం. ఇటీవల వరుసగా జరిగిన ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీఎస్సీ, ఎస్సీలు కలసి విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీలో ఈ కూటమి అత్యధిక స్థానాలను సాధించాలని భావిస్తోంది.బీఎస్పీ అధినేత్రి మాయావతితో టచ్ లో ఉంటున్న అఖిలేష్ వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఈసారి సత్తా చాటాలని కూటమి తహతహలాడుతోంది. కైరానా లోక్ సభ ఉప ఎన్నికల విజయం వారికి మరింత ఊపు తెచ్చిపెట్టింది. బీజేపీని యూపీ నుంచి తరిమికొట్టాలన్న ధ్యేయంతోనే అన్ని విపక్ష పార్టీలు కలసి పోటీ చేస్తాయని ఇప్పటికే అఖిలేష్ ప్రకటించారు. కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి. ఓట్లలో చీలిక రాకుండా బీజేపీని ఒంటరిని చేయాలన్నది యాదవ్ ఆలోచన. తాను కూడా లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు అఖిలేష్ ప్రకటించారు. అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్సీగానే ఉండి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టు కట్టినా మోడీ హవా ముందు వీరు నిలబడలేకపోయారు. అఖిలేష్ ఈసారి కణౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ మయిన్ పురి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే ములాయం సింగ్ ప్రస్తుతం ఆజంగఢ్ ఎంపీగా ఉన్నారు. మరి ఆజంగఢ్ లో ఎవరిని పోటీకి దింపుతారన్నది అఖిలేష్ తెలపక పోవడం విశేషం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళతామని, ఏ పార్టీకి ఎన్ని సీట్లన్నది ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటామని అఖిలేష్ చెబుతున్నారు. మొత్తం మీద పార్లమెంటులోకి అఖిలేష్ అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

Related Posts