రాజస్థాన్ కమలం పార్టీకి పట్టున్న ప్రాంతం. 2013 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ తిరుగులేని విజయాలు సాధించింది. రాజస్థాన్ లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 162 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాలకే పరిమితమైంది. అయితే రాజస్థాన్ లో సీన్ రివర్స్ అయింది. పంచాయతీ ఎన్నికల్లో కూడా కమలం పార్టీకి షాక్ ఇచ్చారు రాజస్థానీయులు. కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం కమలనాధులకు మింగుడు పడటం లేదు. నాలుగు జిల్లా పరిషత్ లనూ కాంగ్రెస్ కొట్టేసింది. లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ చుక్కెదురైంది. మంచి వ్యూహకర్త, విజయాలకు చిరునామాగా ఉన్న అమిత్ షా ఈసారి ఆ రాష్ట్రం విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. కమలదళం అప్రతిహత విజయయాత్రలకు ఇటీవల ఉప ఎన్నికల రూపంలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ రాష్ట్రంలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడం కమలం పార్టీకి కష్టమే. సొంత పార్టీ చేసిన సర్వేలోనే ఈ విషయం స్పష్టమయింది. లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్ లో రాణించకపోతే లాభం లేది అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. రాజస్థాన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత రాజస్థాన్ విషయంలో కీలక నిర్ణయం అమిత్ షా తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.దీంతో రాజస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని కమలనాధులకు అర్థమైపోయింది.ప్రధానంగా ముఖ్యమంత్రి వసుంధర రాజే విధానాలే పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. ఒకవైపు గుజ్జర్ల ఆందోళన, మరోవైపు ప్రధాని మోడీ ఇమేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కొత్తగా నియమించాల్సి ఉంది. వసుంధర రాజేపై ఆధారపడితే కొంప మునిగిపోతుందని భావించిన అమిత్ షా నష్ట నివారణ చర్యలను చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పార్టీ సీనియర్ నేతలు, వసుంధర రాజేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.చేసిన పనులను చెప్పుకోలేకపోవడంతో పాటుగా పార్టీలో సమన్వయం లోపించిందని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా నేతలందరూ కలసి కట్టుగా పనిచేయాలని, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని రాజస్థాన్ నేతలకు షా కొంచెం కటువుగానే చెప్పారు. ప్రజలకు దూరమవుతున్న పార్టీని దగ్గరకు చేర్చే ప్రయత్నం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. వచ్చే నెలలో రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీ భారీ ర్యాలీని నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. మొత్తం మీద రాజస్థాన్ లో మరోసారి రాణించాలని చేస్తున్న అమిత్ షా ప్రయత్నాలు ఫలిస్తాయో లేదోచూడాలి.