బడిగంట మోగింది... విద్యా సంవత్సరం ప్రారంభమైంది.. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు అందజేస్తామన్న అధికారుల మాటలు కోటలు దాటాయి...అయినా విద్యార్థుల దరికి పుస్తకాలు చేరలేదు. ఏటా ఇదే తంతు అయినా పుస్తకాల పంపిణీ సకాలంలో జరగడం లేదు. పాఠశాలలు తెరిచే నాటికి 40నుంచి 50శాతం మాత్రమే పుస్తకాలు విద్యార్థులకు అందుతున్నాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.జిల్లా వ్యాప్తంగా 34 మండలాల విద్యార్థులకు 14,55050 పుస్తకాలు అవసరం. వీటిలో ఇప్పటికే జిల్లాలో 1,79,058పుస్తకాలు వరకు ఉన్నాయి. ఇంకా అవసరమైన 12,81161 పుస్తకాలు కోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత రెండు రోజులుగా జిల్లాకు సుమారుగా 2 లక్షలు వరకు పుస్తకాలు వచ్చాయి. ఇంకా పది లక్షల పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరం వెనుకబడిన విద్యార్థులకు జ్ఞానధార పేరిట నెల రోజులు పాటు తరగతులు నిర్వహించారు. అప్పుడు పుస్తకాలు ఇవ్వకపోయినా పాఠశాల తెరిచేనాటికైనా ఇస్తారని వారంతా భావించారు. కానీ విద్యార్థులకు నిరాశే ఎదురైంది.జిల్లాలో 2739 ప్రభుత్వ పాఠశాలలుఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 2,137, ప్రాథమికోన్నత పాఠశాలలు 235 ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు 367 వరకు ఉన్నాయి. మొత్తం పాఠశాలల్లో సుమారుగా 1,70, 263 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సుమారు 12లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదేసమయానికి జిల్లాలో ఎన్ని పుస్తకాలు అవసరమో గుర్తించి ఇండెంట్ కూడా పెట్టారు. మే నెలాఖరు నాటికి పాఠ్యపుస్తకాలన్నీ పాఠశాలలకు చేరుస్తామని చెప్పిన రాష్ట్ర విద్యాశాఖాదికారుల మాటలు అమలు కాకపోవడంతో.విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.