ఏపీ ఎన్ఆర్టీ కృషి ఫలించింది. ప్రవాసాంధ్రులు ఎంతగానో ఎదరు చూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతోంది. రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించే ‘ఎన్‌ఆర్‌టీ ఐకాన్ టవర్’ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. 33 అంతస్తుల ఈ టవర్‌ను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ నిర్మిస్తోంది. పూర్తిగా ప్రవాసాంధ్రుల పెట్టుబడితో, వారి కోసమే నిర్మిస్తున్న టవర్ ఇది. రాయపూడి సమీపంలో నిర్మించే ఈ భవనం ముందు ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థ 40 దేశాలకు చెందిన జాతీయ పతాకాలతో ఒక పెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్ శాశ్వతంగా ఉంటుంది.9 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో 50 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ భవనం ఆకృతుల్ని కొరియాకు చెందిన స్పేస్ గ్రూప్ సంస్థ ఇప్పటికే రూపొందించింది. అమరావతిని ప్రతిబింబించేలా ఆంగ్ల అక్షరం ‘ఎ’ ఆకారంలో ఆకృతి ఉంటుంది. రెండు టవర్ల మధ్యలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌లో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. 120 దేశాల్లోని ప్రవాసాంధ్రుల ఉనికికి చిహ్నంగా గ్లోబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవికుమార్ వేమూరు తెలిపారు. ఈ భవనంలో 8 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుందని, 100 కంపెనీల ఏర్పాటుకు వీలుంటుందని వెల్లడించారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధికి పాటు పడుతున్న ఎన్ఆర్టీ.. నూతన రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ నిర్మించాలని దాదాపు రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అయితే కొన్ని అడ్డకుంలు ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో వాటిని అధిగమించి ఇప్పుడు ఐకానిక్ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతోంది. విదేశీ హంగులతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోయే ఈ ఐకానిక్ టవర్ అమరావతికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.