నిర్మాణ సంస్థ: శ‌్రీదేవి మూవీస్
తారాగణం: సుధీర్‌బాబు, అదితిరావు హైదరి, సీనియర్ నరేశ్, పవిత్రా లోకేష్, , తనికెళ్ల భరణి, నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ, శిశిర్‌శర్మ,అభయ్ ,హర్షిణి తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
కూర్పు: మార్తాండ్ కె.వెంకటేశ్
ఛాయాగ్రహణం: పి.జి.విందా
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
కొందరు దర్శకుల సినిమాల్లో బలమైన ఎమోషన్స్ కీలకభూమిక పోషిస్తుంటాయి. వారు తెరపై చూపాలనుకున్న విషయాన్ని అందంగా చూపిస్తూనే చెప్పాలనుకున్న విషయాన్ని గుండెను తాకేలా చెప్పడంలో వారు ముందుంటారు. అలాంటి వారిలో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. తొలి చిత్రం గ్రహణం నుండి నేటి వరకు ఆయన పంథాలో మార్పు లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో ప్రేమకథా చిత్రం `సమ్మోహనం`. ఓ మధ్య తరగతి కుర్రాడు, స్టార్ హీరోయిన్ మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ప్రెజెంట్ చేస్తూనే సినిమా వాళ్ల పరిస్థితులను కూడా అందంగా, అందరూ నవ్వుకునేలా తెరకెక్కించారు ఇంద్రగంటి. మరి సమ్మోహనం ప్రేక్షకులను సమ్మోహితులను చేసిందా? లేదా? అని తెలియాలంటే సినిమా కథలోకి వెళ్ళాల్సిందే.
కథ:
విజయ్‌కుమార్ (సుధీర్‌బాబు) చైల్డ్ ఇల్లస్ట్రేటర్. తనకు సినిమా వాళ్లంటే ఇష్టం ఉండదు. వారు సినిమాలో చూపించేదంతా నటనే.. వారికి ఎమోషన్స్ ఉండవు .. అనేటువంటి భావనలుంటాయి. అయితే విజయ్ తండ్రి శర్వా(సీనియర్ నరేశ్)కి మాత్రం సినిమాలంటే ఎంతో అభిమానం ఉంటుంది. రిటైర్మెంట్ అయినా తర్వాత సినిమాల్లో రాణించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంటాడు. తను ఓ సందర్భంలో సినిమా యూనిట్‌కు వాళ్ల ఇంటికి ఫ్రీగా అద్దెకిస్తాడు. అయితే సినిమాలో తనకో క్యారెక్టర్ ఉండాలే నిబంధన పెడతాడు. ఆ సినిమాలో హీరోయిన్ సమీరా రాథోడ్(అదితిరావు హైదరి). ఈమెకు తెలుగు రాదు. విజయ్‌ని తన సినిమాకు తెలుగు డైలాగ్స్ నేర్పించమని కోరుతుంది సమీరా. విజయ్ కూడా సరేనంటాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సమీర కొన్ని పరిస్థితుల కారణంగా తన ప్రేమను వ్యక్తం చేయదు. విజయ్ చెప్పిన ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దాంతో విజయ్ డిస్ట్రబ్ అవుతాడు. తిరిగి విజయ్ మామూలు మనిషి అవుతాడా? అసలు సమీరా.. విజయ్ ప్రేమను ఎందుకు తిరస్కరిస్తుంది? ఇద్దరూ ఒకటవుతారా? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
సినిమాల మీద పెద్దగా ఒపీనియన్ లేని హీరోకీ, నటనే ప్రాణంగా భావించి సక్సెస్‌లో ఉన్న అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ. పేరుకి ఇది ప్రేమ కథే అయినా సినిమా ఆద్యంతం ఎక్కడికక్కడ ఉపనదులను కలుపుకొని ప్రవహించే జీవనదిలా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కాస్త కామన్‌గా ఉంటుంది. డైలాగులు బావున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు గొప్పదనం గురించి, సినిమా వాళ్లను చూసి మామూలు జనాలు చెప్పుకొనే మాటలను చాలా రాశారు. తెలుగు ప్రాముఖ్యత గురించి చెబుతూనే మరోవైపు హీరో తో పాటు హీరో తల్లి తదితర పాత్రలన్నీ ఇంగ్లిష్‌లో సంభాషణలు చెప్పడం కాసింత అసహజంగా అనిపిస్తుంది. కానీ సినిమాలో హీరో ఫ్యామిలీని అప్పర్ మిడిల్ క్లాస్‌గా చూపించారు కాబట్టి ఫర్వాలేదనుకోవచ్చు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. పాటలు కూడా చాన్నాళ్ల తర్వాత బాగా అర్థవంతంగా అనిపించాయి. సన్నటి కథను సినిమాగా మలిచి, ఎక్కడా బోర్ కొట్టకుండా పాజిటివ్ వేలో చెప్పి మెప్పించగలిగారు ఇంద్రగంటి. శ్రీదేవి మూవీస్ సంస్థ అందించిన నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపించాయి. ఆర్ట్, కెమెరా వర్క్స్ గురించి ప్రస్తావించాల్సిందే. సుధీర్‌బాబు గత చిత్రాలతో పోలిస్తే మనిషి చాలా బావున్నాడు. ఎక్స్ ప్రెషన్స్ కూడా పలికాయి. అదితీరావు నోట తెలుగు మరింత మధురంగా వినిపించింది. నటీనటులందరూ వారి వారి పరిధులు మేర చక్కగా నటించారు. ముఖ్యంగా సీనియర్ నరేశ్ పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుంది. ఆర్టిస్ట్ కావాలనుకుని కాలేకపోయి.. చివరకు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తర్వాత నటుడిగా రాణించాలని కలలు కనే వ్యక్తి. అవకాశాల కోసం ఎదురుచూడటం.. దాని వల్ల సందర్భానుసారం వచ్చే కామెడీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆఖరున తనికెళ్ల భరణి చదివి వినిపించే `బుజ్జి ` కథ సాగదీత అవుతుందేమోనని ప్రేక్షకులు భయపడే మాట వాస్తవమే. కానీ ఆ కథను క్లైమాక్స్ కు అందంగా ముడిపెట్టి ముగింపునివ్వడం బావుంది. పవిత్రా లోకేష్‌కి చాన్నాళ్ల తర్వాత మంచి సినిమా అవుతుంది.
ప్లస్ పాయింట్లు
- నటీనటులందరూ బాగా నటించారు
- సంగీతం బావుంది. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతం
- కామెడీ బావుంది
- కెమెరా పనితనం
- ఆర్ట్ వర్క్ బావుంది
మైనస్ పాయింట్లు
- హీరోయిన్ కష్టాలు ఇంతకు ముందు విన్నవే
- రెండో సగం కాస్త మామూలుగా అనిపించింది
రేటింగ్: 2.75/5