YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మత్తుకు బానిసలు

మత్తుకు బానిసలు

మద్యం, డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాలకు యువత అలవాటు పడుతోంది. రాసిన రాతలను చెరిపేయటానికి వాడే వైట్‌నర్‌, చేతివేళ్ల పెయింట్‌ను తొలగించేందుకు వాడే నెయిల్‌ పాలిష్‌ రిమూవర్లు మత్తు పదార్థాల కన్నా ప్రమాదకరంగా మారుతున్నాయి.   అఫ్జల్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న హత్య కూడా వైట్‌నర్‌ లిక్విడ్‌ తాగిన మత్తులోనే జరగడంతో పొంచి ఉన్న ప్రమాదం మరోసారి తెరపైకి వచ్చింది.

నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌, వెల్డింగ్‌ షాపుల్లో వాడే కార్బైడ్‌ పదార్థాలు వైట్‌నగర్‌ కోవకే చెందుతాయి. వైట్‌నర్‌లో విష పదార్థం ఉంటోంది. మార్కెట్‌లో తక్కువ ధరకు లభ్యం కావడంతో దీన్ని కొనుగోలు చేసి తాగటానికి కొంతమంది అలవాటు పడుతున్నారు. వైట్‌నర్‌లో కర్చీప్‌ ముంచి ముక్కు వద్ద పెట్టి పీలుస్తారు. ఊపిరి బిగబట్టి గట్టిగా పీల్చిన క్షణంలోనే మత్తులోకి వెళ్లిపోతారు. అలవాటు పడిన వారు దీని గుర్తించి కొందరికి వివరిస్తారు. దీన్లో ఉన్న మజా ఎలా ఉందో చెప్పి వారిని కూడా దానికి బానిసలుగా మారుస్తారు. టీనేజ్‌ కుర్రాళ్లు తమకు అనువుగా ఉన్న ప్రదేశాలను అడ్డాగా మార్చుకుంటుంటుండగా.. చిన్నారులు కూడా దీనికి బానిసలుగా మారుతున్నారు.

యువకులు, బాలలతోపాటు మహిళలు కూడా వైట్‌నర్‌ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వివిధ వృత్తుల రీత్యా సంచారం చేసే మహిళలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద సంచరించే యాచకులు దీని బారిన పడుతున్నారు. వైట్‌నర్‌ను సమకూర్చుకొని రైలు పట్టాల పక్కనే తాగుతున్నారు. ఓ సారి మత్తు పదార్థాన్ని తీసుకున్న తర్వాత వీరి హావభావాలు, నడక, మాట తీరు మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన యువతులపై దాడులు, అత్యాచార ప్రయత్నాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి.

వైట్‌నర్‌కు బానిసలుగా మారిన వారు నగరంలో సుమారు వెయ్యి మంది ఉంటారని దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. వైట్‌నర్‌ను అత్యధికంగా పాతబస్తీలోనే వాడుతున్నారని గుర్తించి నాలుగేళ్లలో 50 దాడులు నిర్వహించి వందలమంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. విక్రయిస్తున్న షాపులపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. కేవలం వైట్‌నర్‌ మాత్రమే కాకుండా పేరు మార్చి వివిధ మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ గోడౌన్‌పై దాడిచేసి ఇలాంటి పదార్థాలు తయారు చేస్తున్న కార్ఖానాను మూసివేయించారు. వినియోగదారులను గుర్తించి వారి వేలిముద్రలు, ఆధార్‌ కార్డులతో అనుసంధానించి నిఘా పెట్టామని ఆయన చెప్పారు.

క్రమేణా వైట్‌నర్ల వినియోగం తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయాలు కూడా మార్కెట్లో విరివిగా వచ్చేశాయి. వైట్‌నర్‌, నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌, వెల్డింగ్‌ యంత్రాల్లో వాడే కార్బైడ్‌లు, వాహనాల టైర్‌ పంక్చర్లలో వాడే సొల్యూషన్‌లాంటి చౌక రసాయనాలు కూడా మత్తుగా వినియోగిస్తున్నారు. మార్కెట్లలో సులభంగా లభిస్తున్న ఆయా పదార్థాలతో కొంతమంది యువత, బాలలు, మహిళలు దారి తప్పుతున్నారు.

Related Posts