YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంచనాలు తప్పాయా..

అంచనాలు తప్పాయా..

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర మొదలయ్యే సమయంలో "జగనన్న పాదయాత్ర సమయంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అధికారపార్టీలో ఉన్న పెద్దపెద్ద నేతలే మా పార్టీలోకి వచ్చేస్తారు'' అంటూ వైసీపీ నాయకులు భారీగా ప్రచారాలు చేశారు. తీరా చూస్తే, వారి ఆశలు ఏమాత్రం తీరలేదు. ఇంతకీ వారి ప్రచారార్భాటాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.

        ఏ పార్టీ నాయకులకైనా ఆ పార్టీ అధినేతపై అపారమైన విశ్వాసం ఉండటం సహజం. తమ జిల్లాకో, నియోజకవర్గానికో తమ పార్టీ అధ్యక్షుడు వస్తే రాజకీయంగా ఎంతో లాభిస్తుందని ఆయా నేతలు నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితి కొంత ఉండవచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ అదే జరుగుతుందనుకుంటే పొరపాటే! ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో ఇదే జరిగింది. తమ పార్టీ అధినేత జగన్ పశ్చిమలో పాదయాత్ర చేస్తే మొత్తం పార్టీ పరిస్థితే మారిపోతుందని కొందరు వైకాపా నేతలు సంబరపడ్డారు. అదే సమయంలో అధికార టీడీపీకి చెందిన బడాబడా నేతలంతా తమ అధినేత సమక్షంలో పార్టీలో చేరడానికి క్యూకడతారని భారీగా ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే "తామొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు'' అంటారే.. అలాగే మారిందట వారి పరిస్థితి!పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసింది. కానీ వారి అంచనాలు మాత్రం బాక్సాఫీసు వద్ద కొన్ని సినిమాలు బోల్తా కొడతాయి చూడండి- అలాగే బోల్తాకొట్టాయి.

     పశ్చిమలో జగన్ పార్టీ తీవ్రమైన కష్టాల్లో ఉంది. 2014 ఎన్నికల వరకు జిల్లాను బాగా నమ్ముకున్న ఆ పార్టీ నేతలకు ఇక్కడి ఓటర్లు గట్టి షాకిచ్చారు. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలనూ టీడీపీకే కట్టబెట్టారు. దాంతో ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వైకాపా నేతలకు చాలాకాలం పట్టింది. అంతకు ముందు వరకూ పార్టీ పక్షాన ఏ కార్యక్రమం చేపట్టినా ఈ జిల్లా నుంచే మొదలుపెట్టేవారు జగన్‌. అలాంటిది 2014 షాక్‌ తర్వాత కొంత కాలంపాటు ముఖం చాటేశారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. అవి అతి స్వల్పమే! జగన్ వైఖరితో పార్టీ శ్రేణుల్లోనూ కొంత నిరుత్సాహం ఏర్పడింది.

     ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆ పార్టీకి జోష్‌ పెంచే సంఘటన ఒకటి జరిగింది. గత ఏడాది ద్వారకా తిరుమలలో జరిగిన ఒక కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. ఆ సమావేశం విజయవంతం కావడంతో మళ్లీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఊపొచ్చింది. అక్కడనుంచి వారిలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జగన్ పాదయాత్ర చేపట్టడంతో.. పశ్చిమలో మరింత కదలిక వచ్చింది. జిల్లాలో జగన్ పాదయాత్ర జరిగితే చాలా మార్పు వస్తుందని వైకాపా నేతలు అంచనాలు వేసుకున్నారు. ఒక దశలో "ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయనీ, టీడీపీకి చెందిన కొంతమంది బడా నేతలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారనీ'' కొందరు నేతలు భారీగా ప్రచారాలు కూడా చేశారు. అయితే వారి ఊహలు తారుమారు కావడం గమనార్హం!

        పశ్చిమగోదావరి జిల్లాలో కాస్తోకూస్తో పేరున్న ఇద్దరు నాయకులు మాత్రమే జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరెవరూ ఆ పార్టీ వైపు తొంగి చూడలేదు. పార్టీలో చేరిన ఇద్దరు నేతల్లో ఒకరు కాంగ్రెస్‌పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన చెరువకువాడ శ్రీరంగనాథరాజు కాగా, మరొకరు అప్పుడెప్పుడో టీడీపీలో చేరి, ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విద్యావేత్త గుబ్బల తమ్మయ్య. వీరు తప్ప ఇంకెవరూ జగన్ పార్టీలో చేరలేదు. విచిత్రం ఏమిటంటే పార్టీలో చేరిన ఈ ఇద్దరు నేతలు ఆచంట టిక్కెట్ ఆశిస్తున్న వారే కావడం. వారిలో శ్రీరంగనాథరాజుకు కచ్చితంగా టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆయన వైసీపీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ కథ ఎలా ఉన్నా.. ప్రస్తుతం వైసీపీ నేతలే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

 ----------------

63. అక్కడి సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందా.. ? (ఆంధ్రప్రదేశ్)

అమరావతి, జూన్ 15 (న్యూస్ పల్స్): ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయాల్లోకి రావడం ఇప్పటివరకు తెలంగాణలో చూశాం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి సన్నివేశం త్వరలోనే ఆవిష్కృతం కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారు. అశోక్ బాబును ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడే రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడంతో ఆయన ఆశ్యర్యపోయారు. అసలు అశోక్‌బాబు పొలిటికల్ ఎంట్రీకి బీజం ఎలా పడిందియ. 

      సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమాంధ్రవ్యాప్తంగా మారుమోగిన పేరు అశోక్‌బాబు.. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు సమైక్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి.. విజయవాడ బందరు రోడ్డులో ఎన్జీవో అసోసియేషన్‌ నేత విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో అప్పటి మంత్రి పార్థసారథి ఇంటిని ముట్టడించడంతో ప్రారంభమైన ఉద్యమం అటు పిమ్మట రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యమానికి పిలుపు ఇవ్వడంతో యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ రోడ్లమీదకు వచ్చి కదం తొక్కారు.. అయినా కేంద్రం రాష్ట్రాన్ని విభజించింది.. ఆ తర్వాత కూడా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అశోక్‌బాబు అటు ప్రభుత్వానికి.. ఇటు ఉద్యోగులకు మధ్య వారథిగా వ్యవహరిస్తూ అనేక సమస్యలు పరిష్కరించారు.

           సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ కూడా అప్పట్లో ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత సచివాలయం వెలగపూడికి తరలివచ్చింది. మురళీకృష్ణ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తన పరిపాలనలో ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. చంద్రబాబు పర్యటనకు వస్తున్నారంటే ఉద్యోగుల్లో ఆందోళన మొదలయ్యేది. తమను వేధిస్తున్నారనే కోపంతోనే 2004 ఎన్నికల్లో ఉద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. విడిపోయిన రాష్ట్రాన్ని బాగుచేసే సమర్థత చంద్రబాబుకు మాత్రమే ఉందని.. 2014లో అందరూ ఆయనను ఎన్నుకున్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్యోగుల పట్ల సానుకూల వైఖరిని అవలంబిస్తున్నారు. రాష్ర్టం లోటు బడ్జెట్, అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ చంద్రబాబు ఏపి ఉద్యోగులకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. ఉద్యోగుల పదవి విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచారు. సెక్రటేరియట్‌ను వెలగపూడిలో సెంట్రల్ ఎయిర్ కండీషన్ తో నిర్మించారు.

         తాజాగా చంద్రబాబు మళ్లీ పీఆర్సీని ఏర్పాటు చేస్తామని కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా ఉద్యోగులతో సయోధ్య నడుపుతున్న చంద్రబాబు భవిషత్తు వ్యూహంపై దృష్టి సారించారు. ఎన్జీవో అసోసియేషన్‌లో పలుకుబడి ఉన్న అశోక్‌బాబు వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్నారు. 2019 ఎన్నికలకు సర్వహంగులతో రంగంలోకి దిగాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగులను దగ్గరికి తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నవనిర్మాణ దీక్ష సందర్భంగా బెజవాడలో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రికి పక్కనే అశోక్‌బాబు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగిస్తూ చివరిలో అశోక్ బాబును రాష్ర్టానికి సేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటివరకు ఉద్యోగులకు సేవ చేశారని, నిజాయితీ పరుడు, ముక్కుసూటిగా మాట్లాడే అశోక్‌బాబు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పరోక్షంగా తెలుగుదేశంపార్టీలో చేరాలని సూచించారు. చంద్రబాబు విజ్ఞప్తితో వేదిక పైనే ఉన్న అశోక్‌బాబు బిత్తరపోయారు. తనను ఇంతవాడిని చేసిన ఉద్యోగులతో మాట్లాడిన తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని అశోక్‌బాబు చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానానికి ఆయన ఆశ్చర్యపోయారు. కాగా, అశోక్‌బాబును ఆహ్వానించడం వెనుక పెద్ద వ్యూహ్యమే దాగుంది.

ప్రస్తుతం పీఆర్సీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పీఆర్సీ బకాయిలు....డీఏ బకాయిలు... పీఆర్సీ కమీషన్ ఏర్పాటును అశోక్ బాబు ద్వారా ప్రభుత్వం త్వరలో పూర్తిచేయబోతుంది. ఉద్యోగులు బలంగా కోరుకుంటున్న ఇతర సమస్యలను కూడా అశోక్ బాబు ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ వరాలన్నీ ప్రకటించి, అమలు చేసిన తరువాత అశోక్ బాబుకు ఉద్యోగ సంఘాల్లో, ఉద్యోగుల్లో ఇమేజ్ పెరుగుతుందనేది ప్రభుత్వ వ్యూహంగా ఉంది. ఆ తర్వాత ఆయనను తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని రానున్న ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించే విధంగా చేయాలనేది తెలుగుదేశంపార్టీ ఆలోచనగా ఉంది. అశోక్‌బాబు కూడా ఉద్యోగుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన పిమ్మటే వారి అభిప్రాయం తీసుకుని అప్పుడే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అశోక్‌బాబు రాజకీయ ప్రవేశం ఖాయమైనప్పటికీ ఎప్పుడనేదే తేలాల్సిఉంది.

Related Posts