ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలకు మైండ్ సెట్ చేసే పనిలో పడ్డారు. గత నాలుగేళ్లుగా కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోకుండా ఉన్న నేతల కారణంగానే కొన్ని సీట్లలో నెగిటివ్ రిజల్ట్ వస్తున్నాయని సర్వేల ద్వారా గ్రహించిన చంద్రబాబు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. కార్యకర్తలు వద్ద, ప్రజల్లో ఎలా ఉండాలో జిల్లా స్థాయి సమావేశాల ద్వారా తెలియజేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు అవసరాన్ని నొక్కి చెబుతున్నారు.ఈ ఏడాది మొత్తం బీజేపీ, జగన్, పవన్ లాలూచీ రాజకీయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో గ్రామస్థాయిలో ప్రజలకు తెలియజేయాలని బాబు నేతలకు నూరిపోశారు. వైసీపీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలు డ్రామాలని ప్రజలకు తెలియజెప్పాలని, ఇంతవరకూ ఆమోదం పొందకపోవడం, జగన్ పవర్ లోకి వస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుతింటాడో ప్రజలకు సవివరంగా తెలియజేసినప్పుడే గెలుపు తథ్యమన్నారు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంటు స్థానాలను గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు.నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తూనే మరో వైపు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే కడప, చిత్తూరు జిల్లా నేతలతో సమావేశమైన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో విజయం ఎలా వరిస్తుందో వివరిస్తున్నారు. కార్యకర్తలను గౌరవిస్తేనే వారు ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తారని, వారిని పట్టించుకోకుంటే పుట్టి మునగడం ఖాయమని వార్నింగ్ లు ఇస్తున్నారు. కార్యకర్తల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే పనులు అడుగుతారని, మిగిలిన 90 శాతం మంది తమకు గౌరవం దక్కాలని కోరుకుంటారని ఆయన చెప్పారు. కార్యకర్తలకు గౌరవం ఇవ్వకుంటే తాను ఊరుకునేది లేదని చెప్పారు.ఈసారి ప్రతి అసెంబ్లీ స్థానం మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉపయోగించుకోవాలన్నారు. ఈ ఏడాది మొత్తం ప్రజల్లో ఉంటేనే మనం బయటపడతామన్న విషయాన్ని మరిచిపోవద్దని ఆయన తెలిపారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ ఓటు బ్యాంకు మరింత పెరిగిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కమలం పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ముస్లింలు, మైనారిటీలు పార్టీకి దగ్గరవుతున్నారని ఆయన విశ్లేషించారు.