ఈ దఫా 20 లక్షల మంది భక్తులను చేరవేయాలని అంచనా
ఛార్జీలూ ఖరారు చేసిన తెలంగాణ ఆర్టీసీ
ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3వతేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వివిధ డిపోలకు చెందిన 4000 ప్రత్యేక బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. అవసరాన్ని బట్టి మరో 200 బస్సులు అదనంగా నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఆయా ప్రాంతాల నుంచి నడిపే సర్వీసుల ఛార్జీలనూ ఖరారు చేసింది. వరంగల్ రీజియన్ నుంచి 2,150 బస్సులు, కరీంనగర్ నుంచి 520, ఖమ్మం-380, సికింద్రాబాద్- 250, ఆదిలాబాద్- 300, రంగారెడ్డి-100, మెదక్ నుంచి 50 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఆయా సర్వీసుల ద్వారా ఈ దఫా 20 లక్షల మంది భక్తులను జాతరకు చేరవేసేందుకు ప్రణాళిక రూపొందించామని, తద్వారా దాదాపు రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.