YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బాధ్యత మనందరిపై ఉంది.. కడియం శ్రీహరి

 బాధ్యత మనందరిపై ఉంది.. కడియం శ్రీహరి

మేడారంలో అధికారులతో సమీక్షలో స్పష్టకరణ

ఫిబ్రవరి 2న సీఎం కేసీఆర్ ..

 మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్త జన కోటికి వసతుల కల్పనలో ఎలాంటి లోట్లు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. అనేక వ్యయ, ప్రయాసాలకోర్చి తల్లులను కొలిచేందుకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. మేడారంలో ఏర్పాట్లపై ఐటిడిఏ గెస్ట్ హౌజ్ లో సాయంత్రం అధికారులతో సమీక్ష చేశారు.

మేడారంలో ఉదయం తాను క్షేత్ర పర్యటన చేస్తున్నప్పుడు ప్రభుత్వం తరపున కల్పించిన వసతులపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు చెప్పారు. అదే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు కూడా తన దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. అందులో ప్రధానంగా జంపన్న వాగు వద్ద ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మంచిగానే నిర్మించినా... వాటికి సరైన నీటి వసతి కల్పించకపోవడం వల్ల నిరుపయోగంగా మారుతున్న అంశాన్ని తన దృష్టికి వచ్చిందన్నారు.  అదేవిధంగా తల్లులను కొలిచేందుకు వచ్చిన భక్తులు దర్శనం అనంతరం గుడికి దాదాపు కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అడవిలోకి వెళ్లి భోజనాలు చేసుకుంటున్నారని చెప్పారు. అయితే అడవిలో వారి భద్రత అత్యంత ప్రధానమైందని, పోలీసులు అక్కడ కనిపెట్టుకుని ఉండాలన్నారు. గుడి వద్ద జనం తోపుడును కంట్రోల్ చేయడంలో కూడా పోలీసులు మరింత పకడ్భండీ చర్యలు తీసుకోవాలని, ఈ తోపుడు వల్ల అనుకోని సంఘటనలు జరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

జాతరలో అత్యంత ముఖ్యమైన అంశం పరిశుభ్రతని, దీనికోసం ఎప్పటికప్పుడు సిబ్బంది టీమ్ లుగా ఏర్పడి, షిఫ్టుల పద్దతిలో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు సూచించారు. ప్రతి రోజు ఉదయం 2 గంటల నుంచి 4 గంటల వరకు అమ్మవార్లు నిద్రించే సమయంలో భక్తులను ఆపి, గద్దెల వద్ద పరిశుభ్రం చేయాలన్నారు. అదేవిధంగా మేడారంలోని ప్రధాన రోడ్లలో జనం తాకిడి పెరగడం వల్ల వచ్చే దుమ్ము లేవకుండా ఎప్పటికప్పుడు నీటితో తడుపుతూ ఉండాలన్నారు. 30వ తేదీ రాత్రి ప్రధాన రోడ్లను పూర్తి స్థాయిలో పరిశుభ్రం చేయాలన్నారు. కరెంటు సమస్యలు లేకుండా విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జంపన్నవాగులో నీటిని వదిలే నిర్వహణ పకడ్భందీగా చేయాలని ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. 

మేడారం అమ్మవార్ల గద్దెల వద్ద జేబుదొంగలు లేకుండా నిఘాను పటిష్టం చేయాలని, తోపులాట జరగకుండా ముందు జాగ్రత్త చర్యలకు ప్రణాళిక రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలని సూచించారు. మేడారం జాతరలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుక వచ్చిన అధికారులు, సిబ్బందికి కావల్సిన వసతులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సోమవారం నుంచి ముఖ్యమైన అధికారులు కూడా మేడారంలోనే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తారని, అందరూ సమన్వయంలో ముందుకెళ్లాలన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫిబ్రవరి రెండో తేదీన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిప్యాడ్, వసతులు కల్పించడంపై అధికారులు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మేడారం వచ్చిన సందర్భంగా ఆకస్మిక తనిఖీలు కూడా చేసే అవకాశం ఉన్నందున అధికారులు తమ పనుల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  అధికారులు, సిబ్బంది మాత్రం క్యాజువల్ గా ఉండొద్దని, పనుల్లో, భక్తులకు వసతులు కల్పించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం, అలసత్వం వహించవద్దని పదే, పదే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి  సమీక్షలో చెప్పారు. ఇప్పటి వరకు మేడారంలో భక్తులకు వసతులు కల్పించడంలో ఇక్కడి అధికారులు మంచి పేరు తెచ్చుకున్నారని, ఇప్పుడు అంతకంటే మెరుగైన సేవలందించి ఆ పేరును నిలబెట్టుకోవాలన్నారు.

Related Posts