విభజన హామీల అమలు కోసం పోరాటాన్ని ఉదృతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికను రూపొందించారు. అన్ని హామీల గురించే ఒకేసారి కాకుండా, ఒక్కో అంశంపై విడిగా ఆందోళనలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం అమరావతిలోని ప్రజాదర్బార్ హాల్ లో ఆ పార్టీ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నీతి అయోగ్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు విభజన హామీలపై పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలతో చర్చలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తోందని, ఈ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన ఆలోచన. ఇదే సందర్భంగా బీజేపీ-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలకు వివరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి టీడీపీ ఎంపీలకు పలు కీలక సూచనలు చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాని డిమాండ్ చేస్తూ ఎంపీ సీఎం రమేశ్ చేపడుతున్న దీక్షకు ఎంపీలంతా వెళ్లి విజయవంతం చేయాలని, సంఘీభావం తెలపాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 20న ఉక్కు కర్మాగారం కోసం కడపలో భారీ ఆందోళన జరపాలని, విశాఖపట్నంలో 27న రైల్వే జోన్ కోసం ఆందోళన చేయాలని ఆయన సూచించారు. అలాగే వెనకుబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని విభజన హామీల్లో చెప్పినా కేంద్రం ఇవ్వలేదని, ఇందుకు నిరసనగా వచ్చే నెల 4న అనంతపురంలో నిరసన కార్యక్రమం, రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకపోవడానికి నిరసనగా వచ్చే నెల 11న అమరావతిలో ఆందోళనకు ఆయన ఆదేశించారు. అయితే, ఈ కార్యక్రమాలకు వేదికలను ఎంచుకోవడంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఏయే జిల్లాలకు సంబంధించి కేంద్రం హామీలు నెరవేర్చడం లేదో అదే జిల్లాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షింవచ్చని ఆయన భావిస్తున్నారు. వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్లు వెనక్కి తీసుకోవడం, విభజన చట్టంలోని ఆరు ప్రధాన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల్లోనే బీజేపీని ఎండగట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఇదే సమయంలో బీజేపీ-వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు. ఢిల్లీ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీ నేతలను కలిశారని, పీఎం కార్యాలయయంలో విజయసాయిరెడ్డి తిష్టవేస్తున్నారని, ఈ రెండు ఘటనల వెనక రాష్ట్రాన్ని, టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ప్రజలకు వివరించాలనేది టీడీపీ ఆలోచన. ఈ నెల 17న టీడీపీ ఎంపీలందరినీ ఢిల్లీ తీసుకువెళ్లి అక్కడ కూడా ఆందోళన చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇక నీతి అయోగ్ సమావేశంలోనూ విభజన హామీలు ప్రస్తావించాలనుకుంటున్నారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే విభజన హామీలను ప్రస్తావించి వాకౌట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులతో ఆయన ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. ఇలా విభజన హామీలపై, బీజేపీపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యాచరణనే రూపొందించింది.