రోగుల ఆరోగ్యం మెరుగు పర్చాల్సిన ఆసుపత్రి అసౌకర్యాల జబ్బుతో కునారిళ్లుతోంది... మూడేళ్లుగా రోగులు అవస్థలు పడుతున్నారు. పనుల పూర్తికి ఇచ్చిన గడువు ముగిసి ఏడాదిన్నరవుతున్నా నిర్మాణాలు, మరమ్మతులు ఓ కొలిక్కి రాలేదు. యంత్రాంగం తీరు రోగుల పాలిట శాపంగా మారింది... జాప్యానికి తోడు నాసిరకం పనులు అద్దం పడుతున్నాయి. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రి పనుల విషయంలో గుత్తేదారు తొలు నుంచి నాన్చుడు ధోరణే అవలంభిస్తున్నారు. దీనిపై యంత్రాంగం తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి.. పాత కాంట్రాక్టర్ ను తొలగించినట్లు ఇంజినీరింగ్ అధికారులు ప్రకటించారు. అప్పటివరకు పూర్తయిన పనులు చేయాల్సిన నిర్మాణాలకు అంచనాలు తయారు చేసి కొత్త కాంట్రాక్టర్ కి అప్పగిస్తామన్నారు. పాత పనులు చేసేందుకు కొత్త వారు రావడం లేదంటూ మళ్లీ పాత వారికే ఆయన చేపట్టిన పనుల మేరకు అప్పగించామని చెప్పుకొచ్చారు. నెలలు గడుస్తున్నా ఆ పనులూ పూర్తి కాలేదు.
20 ఏళ్ల కిందట నిర్మించిన భవనంలో చాలా విభాగాలు ఇరుకు గదుల్లోనే నడుస్తున్నాయి. వైద్యసేవలు విస్తరించడంతో వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఆధునికీకరణకు సంబంధించి నిధులైతే మూలుగుతున్నాయి. పనుల ఎప్పటికి ప్రారంభం అవుతాయో అధికారులు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. ప్రసవాలకు వచ్చేవారు, వ్యాధినిర్ధారణ, హెచ్‌ఐవీ ఎయిడ్స్ నిర్ధారణ తదితర సేవలు ఇరుకు గదుల్లోనే నడుస్తున్నాయి. ఆసుపత్రి అభివృద్ధి పనుల విషయంలో ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ సరిగా లేదని అన్నివర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. పనుల జాప్యంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పర్యవేక్షణ తూతూమంత్రమే. పనుల పరిస్థితిపై పలుమార్లు హెచ్‌డీఎస్ సమావేశానికి పిలిచినా ఈఈ హాజరు కాలేదని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డి.మోహనరావు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి పనుల జాప్యంపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించినట్లు అధికారులు చెప్పారు. పైపుల లీకులు, ఇతర పనులపైనా ఫిర్యాదులు చేశామన్నారు. తొలుత నుంచి పనులు నత్తనడక, నాసిరకం అని ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం కన్పించ లేదని హెచ్‌డీఎస్ సభ్యులు బాహటంగానే ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. ఇంతవరకు బాగున్నా ఆసుపత్రి పనుల విషయంలో మాత్రం పెద్దగా చొరవ చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల పది, పదిహేను మండలాలకు అవసరమైన ఆసుపత్రి విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలి. నిధుల కోసం కృషిచేసిన నాయకులు పనుల పూర్తికి నడుం కట్టాల్సిన అవసరముంది. సమావేశాల్లో ఈవిషయమై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మార్పు కన్పించలేదు.
నాబార్డు నిధులతో ఆసుపత్రి పైన చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయి. మూణ్నాళ్లకే స్నానాల గదులు, మరుగుదొడ్ల పైపులు లీకుల మయంగా మారాయి. నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతో ప్రస్తుతం పాత వాటిని తవ్వేసి మరమ్మతులు చేస్తున్నారు. ఆయా వార్డుల్లోని రోగులకు ఇబ్బంది తప్పడం లేదు. స్నానపు గదులు, ఇతర అభివృద్ధి పనుల పేరిట ఆసుపత్రి ఆవరణ అంతా తవ్వేశారు. దీంతో ఇదిగో డ్రైనేజీ వ్యవస్థ ఇలా తయారైంది. పరిసరాలు చూస్తే ఆసుపత్రికి పట్టిన ఈరోగం ఎప్పుడు నయం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి పరిసరాలు బాగుండాలని ప్రభుత్వం పారిశుద్ధ్య పనులకు నెలకు రూ.5.80 లక్షలు వెచ్చిస్తోంది. కాయకల్ప పోటీ కూడా నిర్వహిస్తుందోంది. మూడేళ్ల కిందట ఆసుపత్రికి బహుమతి కూడా వచ్చింది. గత రెండేళ్లు పోటీలోనే లేదు. ఎందుకంటే ఆసుపత్రి పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఇందుకు కారణం అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులే కారణం. వెనక వైపు వెళితేచాలు ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి.