రంజాన్ పర్వదినం దాతృత్వానికి, సర్వమత సామరస్యానికి ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రంజాన్ వేడుకల సందర్భంగా అమరావతిలో జరిగిన ప్రార్థనల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు సీఎం ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికి మేలు చేయమని అల్లాను వేడుకున్నానని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇమామ్ లకు, మౌజమ్ లకు వరుసగా ఐదువేలు, మూడువేల రూపాయల చొప్పున పారితోషికంగా ఇస్తున్నామని చెప్పారు. రంజాన్ పవిత్ర మాసమని, మానవాళి ఆనందంగా ఉండాలని ముస్లిం సోదరులు నెలరోజులపాటు ప్రార్థనలు, ఉపవాసాలు ఉన్నారని ఆయన అన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో సామాజిక మార్పు సాధ్యమని మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాన్ని ఆచరించే మాసమిదని ఆయన అన్నారు. ఆ సందేశాన్ని మనం ఆచరిస్తూ ప్రజలందరికీ అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఉర్దూను రెండో భాషగా చేయడం, హజ్ హౌస్ కట్టించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, పండగ సందర్భంగా పన్నెండు లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు.
త్రిపుల్ తలాఖ్ బిల్లుపై టిడిపి అభ్యంతరం చెప్పడం వల్లే అది జెపిసికి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. త్రిపుల్ తలాఖ్కు మొదటగా అభ్యంతరం చెప్పింది తామేనని ఆయన అన్నారు. ఈ విషయంలో ముస్లింల తరఫున తాము పోరాడుతామని చంద్రబాబు చెప్పారు. ముస్లిం విద్యార్థుల కోసం త్వరలో 25 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ముస్లింల కోసం ఏ ప్రభుత్వమూ అమలు చేయని పథకాలను తాము అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. హజ్హౌస్ను టిడిపి ప్రభుత్వమే నిర్మించిందని ఆయన అన్నారు. మైనారిటీ యువతుల కోసం దుల్హన్ పథకం ప్రారంభించామన్నారు.