జూన్ 1నుండి ప్రారంభమై సంచలనం సృష్టిస్తున్న
కొత్త తెలుగు టివి ఛానల్-009
జూన్ 1నుండి ఒక కొత్త తెలుగు ఛానల్ -009 ప్రారంభమయింది.. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే...ఎక్కడా ప్రచారానికి పైసా ఖర్చు పెట్టకుండానే అతి తక్కువ కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందుతున్నది. ఇది ప్రారంభమయిన నాటినుండీ మిగిలిన అన్ని తెలుగు టీవీ ఛానళ్ళ రేటింగ్స్ క్రమేణా పడిపోతున్నట్లు సర్వే గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ ఛానల్ కు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అన్ని వయసులవాళ్ళు ఈ కొత్త ఛానల్‌కు అతుక్కుపోవడం చూసి అందరూ విస్తుపోతున్నారు. ముఖ్యంగా ప్రతికలు, టీవీలయాజమాన్యాలు, మేధావులు, రాజకీయనాయకులకు ఈ మార్పు విస్మయాన్ని కలుగచేస్తున్నది.
ఇంత సంచలనానికి కారణం-ఆ ఛానల్ ప్రారంభానికి ముందు చేసిన ఒక ప్రకటన అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంతకూ ఆ ప్రకటనలో ఏం ఉంది ?
ఆ ప్రకటన యథాతథంగా ఇలా ఉంది –
‘‘ మా ఛానల్లో చంద్రబాబునాయుడును గానీ, జగన్మోహన్ రెడ్డినిగానీ, పవన్ కళ్యాణ్నుగానీ...వారివారి భజనబృందాలనుగానీ చివరకు రమణ దీక్షితులనుకూడా చూపం. కేసిఆర్ కుటుంబసభ్యులనుగానీ, మాడిపోయిన బల్బుల్లా కనిపిస్తున్న ఉద్యమ నాయకులను గానీ చూపం. అమావాస్య, పున్నములకోసారి రాహుల్ గాంధీ, మోదీ, షా, వెంకయ్యలు కనిపిస్తారుగానీ వారి మాటలు(విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే కాబట్టి) వినిపించనీయం. హేతువాదులు, భక్తుల మధ్య ఉత్తుత్తి కత్తియుద్ధాలవంటి.... రాజకీయ నాయకులు ఒకళ్ళపంచెలు మరొకరు లైవ్‌లో ఊడదీసుకోవడం వంటి టాక్షోలుండవు, చిద్విలాసంగా నవ్వుతూ కట్టెలు ఎగదోసే ఆంకర్లుకూడా ఉండరు. తెలుగు కుటుంబ రాజకీయాల- సీరియళ్ళు ప్రసారం చేయం. ఇప్పటివరకు ఇటువంటి సినిమా రాలేదు-అని ఊదరగొడుతూ వచ్చే కొత్త సినిమాల తాలూకు వార్తలుండవు. సినిమా హాస్యగాళ్ళునడిపే బూతు ఇంటర్వ్యూలు, కుళ్ళు సెక్స్ జోక్‌లను కుళ్ళబొడుస్తూ అకారణంగా పగలబడి నవ్వే ప్రోగ్రాంలకు మేం విరుద్ధం.’’ ఇదీ ఆ ప్రకటన.
ఈ ఛానల్ చూడడం మొదలయిన తరువాత వాంతులు, విరేచనాలు తగ్గాయంటూ హాయిగా అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు కదా, అది ఏ నంబరులో వస్తుందో చూద్దాం....అని ఆత్రుతగా రిమోట్ నొక్కుతూ లేవబోయి... మంచంమీదినుంచి ధబ్బున పడ్డా. భళ్ళున తెల్లారింది. నిద్ర మత్తు చప్పున వదిలింది.