ఆదివారం ఉదయం 10గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షత జరగనున్న 4వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరగనున్నది. ఉదయం 10గంటలకు, మద్యాహ్నం మూడున్నరకు ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు హజరవుతున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, విభాగాలు,విధానాలు రూపొందించడమే ప్రధాన లక్ష్యంగా నీతి ఆయోగ్ పాలక మండలి పని చేస్తోంది. గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి పనులు, భవిష్యత్లో జరగవలసిన అభివృద్ధి పై సమావేశంలో సమీక్షిస్తారు. రైతుల రెట్టింపు ఆదాయం, ఆయుష్మన్ భారత్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంద్రధాన్ వంటి ముఖ్యమైన పథకాల పురోగతి ,జిల్లాల అభివృద్ధి,150 వ మహాత్మా గాంధీ జయంతి సంబరాలవంటి ముఖ్యమైన అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు. రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయాన్ని నీతి ఆయోగ్ ద్వారా పంచాలని, 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకోకుంటే తీవ్రంగా నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు వాదిస్తున్నాయి.