- ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు
ఆర్టీసీ బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎస్‌ఓటీ అదనపు డీసీపీ సయ్యద్ రఫీక్ కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన పానెం రాంమోహన్, నిమ్మగడ్డ కర్తీక్‌లు స్నేహితులు. విశాఖపట్టణం, రాజమండ్రి ప్రాంతాల నుంచి గంజాయిని విజయవాడ, హైదరాబాద్‌కు సరఫరా చేసే ఏజెంట్ సురేష్‌తో సంబంధాలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి, దానిని రూ. 6 వేలకు బయట మార్కెట్లో ఈ ముఠాలు విక్రయిస్తుంటాయి. సురేష్‌ను 2014లో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజెంట్‌తో సంబంధాలున్నా రాంమోహన్, కార్తీక్‌లు గంజాయిని సేకరించి బస్సులలో హైదరాబాద్‌కు తెచ్చి విక్రయిస్తుంటారు. ఇటీవల 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసి విజయవాడ నుంచి ఎల్బీనగర్‌కు ఆర్టీసీ బస్సులో వచ్చారు. అల్కాపురి చౌరస్తా వద్ద గంజాయిని అందించేందుకు మరో ఏజెంట్ కోసం ప్రయత్నిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ కోసం ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు.