తమిళనాడులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు ఎటువైపు వెళతారో తెలియని పరిస్థితి. ఇప్పడు అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ వర్గంలో చిచ్చు రేగింది. కోర్టు తీర్పు ఆలస్యమవుతుందని తెలియడంతో దినకవర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అనర్హత వేటు పడిన 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును మూడో న్యాయమూర్తికి బదిలీ చేశారు.మూడో న్యాయమూర్తికి కేసును బదిలీ చేయడంతో కేసు తేలడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని భావించిన ఎమ్మెల్యేలు తమ పిటీషన్లు వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో తంగ తమిళ్ సెల్వన్ ఇప్పటికే పిటీషన్ వెనక్కు తీసుకున్నారు. స్పీకర్ తమపై అనర్హత వేటు వేసిన అంశాన్ని సవాల్ చేస్తూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పిటీషన్లు వేశారు. ఇప్పడు తంగ తమిళ్ సెల్వన్ పిటీషన్ ను వెనక్కు తీసుకోవడంతో టీటీవీ శిబిరంలో గందరగోళం నెలకొంది.తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని గతంలో దినకరన్ చెప్పారు. అయితే దినకరన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు కు వెళ్లడం అనవసరమని భావిస్తున్నారు. ఆరు నెలలుగా తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేక పనులన్నీ ఆగిపోయాయని, తాము న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంటే ఇక్కడి ప్రజల ఇబ్బందులను ఎవరు పరిష్కరిస్తారని దినకరన్ వర్గం ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వం ప్రశ్నిస్తున్నారు. దినకరన్ వర్గం నుంచి చాలా మంది జారుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. పళనిస్వామి ఆపరేషన్ కు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పడిపోయారని, వీరిలో కొందరికి మంత్రి పదవుల హామీ కూడా దక్కిందంటున్నారు. దినకరన్ మాత్రం తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా తనతోనే ఉన్నారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా విజయం తమేదేనని, పళనిస్వామికి దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.