పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఇదీ చాలామంది ప్రశ్న. శ్రీకాకుళం నుంచి ప్రారభించారు యాత్ర. విశాఖ జిల్లాతో ముగిసింది. అలా అని ముగిసిపోయిందనీ అనుకోవడానికీ లేదు. ఎందుకంటే అలాంటి ప్రకటన ఏదీ అధికారికంగా రాలేదు. చంద్రబాబు మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసినపుడు పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు.ఆయన యాత్రల గురించి చాలా వినిపించాయి. కానీ చిత్రంగా అవేవీ మెటీరియలైజ్ కాలేదు. తిరుపతి కొండ కాలినడకన ఎక్కి, కార్యాచరణ ప్రకటిస్తా అని హల్ చల్ చేసారు. ఆ తరువాత అది కాస్తా కేవలం ఉత్తరాంధ్ర సభలకు పరిమితం అయిపోయింది. ఈ ఉత్తరాంధ్ర సభలు కూడా ఎన్నికల మీటింగ్ లు మాదిరిగా మాట్లాడుకుంటూ వెళ్లిపోవడం తప్ప, కమిటీలు, పార్టీ నిర్మాణం వంటి వ్యవహారాలు ఏమీలేవు.ఒక్క చోట కూడా ఏ ఇతర పార్టీ నాయకుడు జనసేనలోకి వచ్చిన దాఖలా లేదు. పైగా మీటింగ్ మీటింగ్ కు మధ్యలో రెండు మూడు రోజులు విశ్రాంతి. సరైన రిసార్ట్ కనిపిస్తే చాలు రెస్ట్ తీసుకోవడమే. దీంతో పవన్ యాత్ర మీద ఆసక్తి లేకుండాపోయింది. విశాఖజిల్లా నుంచి ఈస్ట్ లోకి పవన్ వెళ్లారు అనుకుంటే అదే టైమ్ లో ఈస్ట్ లోకి జగన్ ఎంట్రీ ఇచ్చేసాడు.దీంతో పవన్ బ్యాక్ టు పెవిలియన్ అనుకుంటూ కామ్ గా హైదరాబాద్ వచ్చేసి, ఇంట్లోకి వెళ్లిపోయారు. ఎన్నికలు నెలల దూరంలోకి వచ్చేసాయి అని వినిపిస్తోంది. కానీ పవన్ పార్టీకి మాత్రం జవసత్వాలు నింపే పని కనిపించడంలేదు. ఎంతసేపూ ట్విట్టర్ లో కబుర్లు తప్ప, మరోటి కనిపించడం లేదు.అందుకే లగడపాటి సర్వేలో అంత తక్కువ ఓట్లశాతం, అన్ని తక్కు వ సీట్లు వస్తాయని అంచనా వేసినా, జనం ఎవ్వరికీ ఆశ్చర్యం కలగడంలేదు. ఈ లెక్కన చూస్తుంటే ప్రజారాజ్యం కన్నా ఘోరంగా, ఆటలో అరటిపండు అన్న చందంగా జనసేన మారిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కానీ ఇదే కనుక జరిగితే కాపు సామాజికవర్గం రాజకీయంగా మరి కొంచెం వెనక్కు వెళ్లిపోతుంది. మళ్లీ సమీప భవిష్యత్, ఆ కుల నాయకులు ఎవ్వరూ రాజకీయ పార్టీ స్టార్ట్ చేయడానికి ధైర్యం చేయరు.