రెండు రోజులుగా సిక్కోలు అగ్నిగుండంగా మారింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడి ప్రతాపం మొదలైపోతోంది. ప్రజలు ఎండ తీవ్రతకు తాళలేక విలవిల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం మరింత ఎక్కువై వేడి గాలులు వీయడంతో తట్టుకోలేకపోతున్నారు. మరో వారం రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.జగన్నాథం తెలిపారు. 21వ తేదీ వరకూ ఇదే విధంగా వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఈదురుగాలులతో కూడి వర్షం కురుస్తుందన్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగులుతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఉపాధి కూలీలు ఎండ వేళ పనులు చేయకూడదన్నారు. వడదెబ్బకు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.