రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు కాల సర్పాలుగా మారి బుసలు కొడుతున్నారు. అవసరాలను ఆసరా చేసుకొని వడ్డీ మీద వడ్డీ వేస్తూ అమాయకుల శ్రమను జలగల్లా పీడిస్తున్నారు. కాదంటే వారిపై కాటేసేందుకు కూడా వెనకాడటం లేదు. కొందరు వడ్డీ వ్యాపారులు నేరుగా పోలీస్ స్టేషన్లలో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులతోనే పంచాయితీలు చేయిస్తూ వారికి రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటూ దర్జాగా తిరుగుతున్నారు. గుంటూరులోని ఫ్రూట్ మార్కెట్లో ఇప్పటికీ రోజు వారీ వడ్డీలు బహిరంగంగానే కొనసాగుతుండటం మీటరు వడ్డీ వ్యాపారుల దందాకు నిదర్శనం. తెనాలిలోని కూర గాయల మార్కెట్‌లో స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఆయనకి నెలవారీ మామూళ్లు ఇచ్చుకుంటూ మీటరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. నరసరావుపేట కూరగాయల మార్కెట్‌లో అధికార పార్టీ అండదండలతో వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. అడ్డగోలు వడ్డీలను కట్టలేక, వారి వేధింపులు భరించలేక కొంతమంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు.కూతురి పెళ్లి.. పిల్లల చదువులుల.. కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు.. ఇలా పేదవాడి అవసరాలు, చిరు వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. మీటర్ వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ... ఇలా పేరు ఏదైనా నిలువు దోపిడీ మాత్రం సర్వసాధారణంగా మారింది. అప్పుకోసం తమ వద్దకు వచ్చే వారి వద్ద వడ్డీ వ్యాపారస్తులు ఖాళీ చెక్కులు, ఏటీఎం కార్డులు, ప్రాంసరీ నోట్ల మీద సంతకాలు చేయించుకుని ఇస్తున్నారు. వందకు రూ. 10 నుంచి 20 వడ్డీని ముందుగానే తమ వద్ద ఉంచుకుని మిగిలిన డబ్బును అప్పుగా ఇస్తున్నారు. రుణగ్రహిత వడ్డీ చెల్లించడం ఆలస్యం అయినా, అక్రమంగా వసూలు చేస్తున్న వడ్డీ గురించి ప్రశ్నించినా కోర్టులో కేసు వేసి బెదిరిస్తున్నారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం కంటి తుడుపుగా నామమాత్రపు కేసుల నమోదు చేసి చేతులుదులుపుకోవడంతో మళ్లి కాల నాగులు విషం కక్కడం మొదలు పెట్టాయి. నరసరావు పేటలో గత ఏడాది ‘కాల్ నాగుల’ వేధింపులు తట్టుకోలేక రెండు నెలల వ్యవధిలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరిచంలేక ఆత్మహత్యలు చేసుకుని తమవారిని రోడ్లపాలు చేసిన వారు కొందరు ఉంటే, మరి కొన్ని కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్లిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి.జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. వడ్డీ వ్యాపారం చేసే వారు లైసెన్సు పొందకుండా వడ్డీలకు ఇస్తూ రుణగ్రహితలను వేధింపులకు గురిచేస్తున్నా అధికారులు మాత్రం వారిని పట్టించుకోవడం లేదు.