అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి? ఆయన వైఖరిపై అనంతపురం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రగిలిపోతున్నారు? ఎంపీ జేసీకి వారు ఎలాంటి కౌంటర్ ఇచ్చారు? జిల్లా తెలుగుదేశంలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నోటినుంచి వచ్చే ఏ మాట అయినా సరే- రాజకీయంగా పెనుదుమారం రేపుతుంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వచ్చిన దివాకర్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లలో క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో మాత్రం ఆయన సంబంధాలు అంతంత మాత్రమే! అయినప్పటికీ ఏ విషయమైనా సరే ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు. చేయాల్సిన పనులను అంతే ధైర్యంగా చేసేస్తున్నారు.
తాజాగా ఎంపీ జేసీ చేసిన వ్యాఖ్యలు అనంత తమ్ముళ్లలో సెగలు రాజేశాయి. జిల్లాలో ఇప్పడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏ ముగ్గురో తప్పా మిగతా అందరూ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని మీడియా సమావేశంలో జేసీ ప్రకటించారు. పైగా జిల్లాలోని సిట్టింగ్ అభ్యర్థులు అందరినీ మార్చేయాలని సూచించారు. జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం కోసం తాను ఒక జాబితాను తయారుచేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
దివాకర్‌రెడ్డి ప్రకటనపై జిల్లాకి చెందిన టీడీపీ సిట్టింగ్‌లంతా రగిలిపోతున్నారు. గెలిచే అభ్యర్థులు ఎవరు? ఓడిపోయే నేతలు ఎవరు? అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసునని ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్న విషయం చంద్రబాబే ఫైనల్ చేస్తారని అన్నారు. ఎంపీ దివాకర్‌రెడ్డి చెబితే సీఎం చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వరని కూడా చురకలంటించారు. పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి ముందు అనేక రకాల సర్వేలు, వ్యక్తిగత సమాచారం సేకరిస్తారనీ, ఆయా అంశాలను మధింపు చేసిన తర్వాతే అభ్యర్థిత్వం ఖరారుచేస్తారని వారు గుర్తుచేశారు. దివాకర్‌రెడ్డి వ్యక్తిగత అభిప్రాయాలకూ, పార్టీ నిర్ణయాలకీ తేడా ఉంటుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
అనంతకి చెందిన తెలుగు తమ్ముళ్లు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైఖరిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. టీడీపీలోకి చేరికలను ప్రోత్సహించడం ద్వారా తన వర్గాన్ని ఆయన పెంచుకుంటూ పోతున్నారని వారు విమర్శిస్తున్నారు. దీనివల్ల టీడీపీలో గ్రూపులు పెరిగిపోవడమే కాకుండా కాంగ్రెస్ కల్చర్ వేళ్లూనుకుంటోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఎంపీ జేసీ చర్యలపై జిల్లా నేతలంతా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీనికి తోడు.. తమ పదవులకు ఎసరు పెట్టడానికి ఎంపీ జేసీ ప్రయత్నిస్తున్నారన్న భావన వారిలో క్రమంగా బలపడుతోంది. మొత్తానికి ఎంపీ జేసీ తాజా వ్యాఖ్యలు జిల్లా అధికారపార్టీ పెద్దలను కుదిపేస్తున్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై పార్టీ హైకమాండ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.