లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో జూన్ 11 నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తోన్న ధర్నాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరి అనుమతితో గవర్నర్ నివాసంలో
ధర్నా లేదా దీక్ష చేస్తున్నారని సోమవారం ఆప్ నేతలను ప్రశ్నించింది. కేజ్రీవాల్ ధర్నాను వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఓ పిటిషన్ దాఖలు చేయగా, ఐఏఎస్ అధికారులు
విధులు బహిష్కరించడాన్ని నిరసిస్తూ మరో పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ ఏకే చావ్లా, నవీన్ చావ్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ
చేపట్టింది. అప్రకటిత సమ్మెలో ఉన్న ఢిల్లీ ఐఏఎస్ అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ఆప్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు నిర్వహించే సమావేశాలకు తాము
హాజరుకాబోమని ఐఏఎస్ అధికారులు ప్రకటించిన విషయాన్ని ఆప్ మంత్రుల తరఫున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న న్యాయమూర్తి..
ఇలా ధర్మా చేయడానికి ఎవరు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. అయితే ఇది మంత్రుల వ్యక్తిగత నిర్ణయమని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీన్ని అధికారంగా
చేపట్టారా అని మరోసారి ధర్మాసనం నిలదీసింది. అయితే ఇలాంటి ప్రదర్శనను ధర్నాగా పిలవరని లాయర్ బదులిచ్చారు. అయితే మీరు ధర్నాగా పిలవనప్పుడు, మరొకరి కార్యాలయం
లేదా ఇంటిలోకి వెళ్లి ఎలా నిరసన తెలుపుతారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంతోపాటు మంత్రులు గవర్నర్ కార్యాలయం లోపల కూర్చుని ధర్నా చేస్తున్నారు... గుమ్మం దగ్గర,
బయటా కాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం, ఐఏఎస్ అధికారులు సంఘాన్ని విచారించాలని
నిర్ణయించింది.