భారతీయ జనతా పార్టీ(బీజేపీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటలు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద సాగవని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రెండు పార్టీల కుట్ర రాజకీయాలకు 2019 ఎన్నికల్లో మహాభారతంలో శ్రీకృష్ణుడిలా చంద్రబాబు చెక్ పెడతారన్నారు. దుష్టచెతుష్టయం ఆటలు ఆయన వద్ద పనిచేయవన్నారు.
ఢిల్లీలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం అందరినీ ఆకట్టుకుందని చెప్పారు. దేశం మొత్తం ఇప్పుడు దానినే ప్రధాన అంశంగా చర్చిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వంటి రాష్ట్ర సమస్యలను లేవనెత్తడంలో ఆయన సఫలీకృతుడయ్యారని చెప్పారు. నరేగా నిధుల వినియోగానికి సంబంధించి కూడా ఆయన మంచి సలహాలు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వారి వద్ద ఏమీలేదన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను ఆయన తేటతెల్లం చేశారని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన మాట్లాడిన తరువాత ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు.
బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలు
బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, వారికి రాజకీయాలేగానీ, దేశం గురించి ఆలోచన లేదని విమర్శించారు. తాము చేసిన రాజీనామాలను ఆమోదింపజేసుకోనున్నట్లు వైసీపీ ఎంపి మిధున్ రెడ్డి చెబుతున్నారని, రెండేళ్ల నుంచి వారి రాజీనామా నాటకం సాగుతోందన్నారు. రాజీనామాలు ఆమోదింపజేసుకోవడంతోపాటు ఎన్నికలు కూడా పెట్టిస్తే ప్రజలు ఏం పాఠం చెబుతారో తెలుస్తుందన్నారు. ప్రజలు మీ మాటలు నమ్మరని, తిప్పికొడతారని, డ్రామాలు మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు ముగింపు పలుకుతారని, వైసీపీ టెంట్ మూతేసుకోవలసి వస్తుందన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాల్లో ఇరుక్కోకుండా ప్రజల కోసం పనిచేయమని వైసీపీకి డొక్కా సలహా ఇచ్చారు.