YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

సమస్యలు తీరాలి.. సత్ఫలితాలు రావాలి..

సమస్యలు తీరాలి.. సత్ఫలితాలు రావాలి..
పేద, బడుగు వర్గాలకు చెందిన పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్యనందించేందుకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలు ఏర్పాటుచేసింది. పిల్లలు సమర్ధవంతమైన విద్య లభించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ పాఠశాలలు ఏర్పడి ఐదేళ్లు అవుతున్నా.. పలు సమస్యలను మాత్రం అధిగమించలేకపోతున్నాయని విద్యార్ధి సంఘాలు  విమర్శిస్తున్నాయి. ఈ బడుల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరిస్తే.. మంచి ఫలితాలు వస్తాయని స్పష్టంచేస్తున్నాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగరిలతో పాటూ నల్గొండలోని ఆదర్శపాఠశాలలు మొత్తం 32. ఈ బడుల్లో 6 నుంచి 10 తరగతులు బోధిస్తారు. ఒక్కో తరగతికి వంద మంది విద్యార్ధులకు చోటు కల్పిస్తారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో సుమారు 19,200 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్ని గ్రూపుల్లో ఇంటర్మీడియట్ విద్యనూ ఆదర్శ పాఠశాలల ద్వారా అందిస్తున్నాయి. ఇంటర్ విద్యార్ధులు దాదాపు 25వేల మంది ఉండే అవకాశం ఉంది. వేలాది మంది విద్యార్ధులు చదువుకుంటున్న ఈ పాఠశాలల్లో పలు సమస్యలు ఉన్నాయి. వసతి, బోధన సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంది. దీంతో అర్హులైన విద్యార్ధులు ఇతర పాఠశాలలవైపు మళ్లుతున్నారు. 
ఆదర్శ స్కూళ్లకు అనుబంధ హాస్టళ్లలో విద్యార్ధులందరికీ వసతి లభించడంలేదు. దీంతో పలువురు దూరప్రాంతాల నుంచే బడులకు వస్తున్నారు. ఇక హాస్టళ్లలో ఇంటర్ విద్యార్ధినులకే ప్రవేశం ఉండడంతో మిగిలిన తరగతుల వారికి ఇబ్బందులు తప్పడంలేదు. హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో అనేకమంది విద్యార్ధులు గురుకుల పాఠాశాలలకు వెళ్లిపోతున్నారు. విద్యార్ధులందరికీ వసతి కల్పించాలని విద్యార్ధి సంఘాలు, తల్లితంత్రులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నా.. ఈ విషయం కొలిక్కి రావడంలేదు. ఇక ఆదర్శ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంది. దాదాపు 640మంది ఉండాల్సిన పీజీటీ, టీజీటీలు 540 మందే ఉన్నారని సమాచారం. ఇక భవనాలకు కేటాయించిన నిధుల్లోనూ కోత విధించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.3.02 కోట్లు కేటాయించగా.. నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం కోత విధించింది. అంటే రూ.2.73 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో మొదటి అంతస్తులో తరగతి గదులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 20 చోట్ల ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదర్శ పాఠశాలలను పటిష్టం చేయాలని, పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య దక్కేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts