బీజేపి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణ తాజాగా పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనల్లో తొలి విడతగా ఏడు జిల్లాల్లో పర్యటించనున్నారు. జూలై 6వ తేదీతో ముగియనున్న తొలి విడత పర్యటన శ్రీకాకుళం జిల్లాతో శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ అధ్యక్షుని హోదాలో తొలిసారి జరుగుతున్న పర్యటనలు కావడంతో ప్రతి జిల్లాలో ఘన స్వాగతంతోపాటు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాల పర్యటనల సందర్భంగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లా పదాధికారుల సమావేశాలతోపాటు జిల్లా కోర్ కమిటీల సమావేశాలు సైతం నిర్వహిస్తారు. పార్టీ పటిష్ఠానికి అనుసరించాల్సిన భవిష్యత్ వ్యూహాలపై ఈసందర్భంగా చర్చిస్తారు. జిల్లా పర్యటనల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సమావేశాలను నిర్వహించి, అక్కడ సహపంక్తి భోజనాలు, రాత్రి బస చేస్తారు. ప్రతీ జిల్లాలో రెండు రోజుల వంతున జరిగే పర్యటనలో రెండో రోజు మేధావులతో సమావేశమవుతారు. అలాగే రైతులతో చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు. కన్నా పర్యటన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాల్లో జూన్ 20, 21, విజయనగరం జిల్లాలో జూన్ 22, 23, పశ్చిమ గోదావరి జిల్లాలో 24వ తేదీన పర్యటిస్తారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతోన్న పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అనంతరం కడప జిల్లాలో జూన్ 27, 28, కర్నూలు జిల్లాలో జూన్ 29, 30, నెల్లూరు జిల్లాలో జూలై 3, 4, చిత్తూరు జిల్లాలో జూలై 5, 6 తేదీల్లో కన్నా పర్యటిస్తారు.