నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్ణాటక రాష్ట్రంలో పది రోజులుగా ఓ మోస్తరు నుంచి జోరుగా వర్షాలు కురుస్తుండడంతో ఆంధ్ర, కర్నాటక ఉభయ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయంలోకి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. డ్యాంలోకి నాటికి 50 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం నిండితే 100.86 టీఎంసీలు నిల్వ ఉంచుకుని కర్ణాటకతో పాటు ఆంధ్ర రాష్ట్ర పరిధిలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది. గత ఏడాది కురిసిన వర్షాలతో డ్యాంలో చేరిన నీటిలో ప్రస్తుతం 20.08 టీఎంసీలు నిల్వ ఉంది. తుంగభద్ర బోర్డు నిబంధనల మేరకు 16 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉన్నా ఏపీ వాటా మేరకు విడుదల చేయించుకోవచ్చు. అయితే దామాషా ప్రకారం రావాల్సిన నీటిలో గత ఏడాది 17.476 టీఎంసీలు కేటాయింపులు జరిగాయి. అయితే హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లా ఆయకట్టు, తాగునీటి అవసరాల మేరకు 18.897 టీఎంసీలు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఏపీలోని అనంతపురం జిల్లా సరిహద్దులోని 105వ కి.మీ వద్ద హెచ్చెల్సీలో వాస్తవంగా 17.399 టీఎంసీలు నమోదైంది. ఈ లెక్కన ఇంకా 0.77 టీఎంసీల నీరు తగ్గింది. ఏడాదైనా కర్ణాటకలో వర్షాలు భారీగా కురిస్తే అనంతపురం జిల్లాలోని ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలకు తగినంత నీరు లభిస్తుందన్న ఆశాభావంతో జిల్లా రైతులు ఉన్నారు. కాగా గత ఏడాది 10 టీఎంసీల నీరు మాత్రమే తుంగభద్ర జలాశయంలో నిల్వ ఉండేది. ప్రస్తుతం 20 టీఎంసీలు నిల్వ ఉండగా, అందులో నుంచి ఆదివారం 43.15 క్యూసెక్కుల నీరు విడుదల అయిందని టీబీ హెచ్చెల్సీ అధికారులు వెల్లడించారు.ఈసారి కర్ణాటకలో తుంగభద్ర పైభాగంలో వర్షాలు బాగా కురుస్తుండటంతో అనంతపురం జిల్లా ఆయకట్టు రైతుల్లో మరోమారు ఆశలు రేకెత్తాయి. తుంగభద్ర జలాశయం నీటిపై ఆధారపడి జిల్లాలోని హెచ్చెల్సీ పరిధిలో 1.6 లక్షల ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. అయితే గత నాలుగైదేళ్లుగా కేవలం 50 వేల నుంచి 60 వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. గత ఏడాది రైతులు, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో విడుదల చేసిన నీటితో హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో దాదాపు 81 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలను రైతులు సాగు చేశారు. ఈసారి భారీగా వర్షాలు కురిస్తే లక్ష ఎకరాలు సాగులోకి రావచ్చని, ఆరుతడి పంటలతో పాటు వరి వంటి దీర్ఘకాలిక పంటలకు నీరొచ్చే అవకాశం ఉండొచ్చని రైతులు ఆశతో ఉన్నారు. అయితే నీటి లభ్యత, కేటాయింపులను బట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, నైరుతి రుతుపవనాలు ఏపీకన్నా, కర్ణాకటలో ఆశాజనకంగా ఉన్నందున ఆయకట్టు పరిధిలోని సాగు విసీర్ణం పెరగవచ్చన్న అభిప్రాయాన్ని టీబీ హెచ్చెల్సీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.