2019లో మోదీ మళ్లీ గెలుస్తారా? లేదా? అన్నదే చర్చించుకుంటున్నారు. దీనికి కారణం మొ్తం పార్టీ మోదీ ఉక్కు పిడికిలిలో ఉండటమే. ప్రధానిఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా-ఇండియా,ఇండియానే ఇందిర’’ అని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా పిలుపిచ్చారు. ఆయన అస్సోం రాష్ట్రానికి చెందిన వారు. అప్పట్లో ఆయన పిలుపుపై పెద్ద చర్చే జరిగింది. ఉధృతంగా వివిధ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆయన్ను ఇందిర ఏజెంట్ అని కొందరు నిందించారు. మరికొందరు స్వామి భక్తి శృతి మించిందని తప్పు పట్టారు. ఎన్ని విమర్శలు వచ్చినా బారువా స్పందించలేదు.ఇప్పుడు కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అప్పుడు యావత్ పార్టీ ఇందిర చుట్టూ పరిభ్రమించగా, ఇప్పుడు కమలం పార్టీ ఆసాంతం మోదీచుట్టూ తిరుగుతోంది. అందువల్లే మోదీ మళ్లీ గెలుస్తారా? అన్న చర్చ జరుగుతుంది తప్ప బీజేపీ పరిస్థితి ఏమిటన్న ప్రశన ఉత్పన్నమవ్వడం లేదు. ఈ ఏడాది చివర్లో జరిగే ఛత్తీస్ ఘడ్, మిజోరాం, మద్యప్రదేశ్,రాజస్థాన్ ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినా ఆ ఖ్యాతి ఖచ్చితంగా మోదీ ఖాతాలోకి వెళుతుంది. ఒకవేళ ఓడిపోయినా ఆ అపఖ్యాతి కూడా మోదీ ఖాతాలోనేచేరుతుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. ఎందుకంటే 2014 లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొత్తం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. స్వరాష్ట్రంలో తన దగ్గర మంత్రిగా పనిచేసిన అమిత్ షాను తీసుకు వచ్చి ఒక్కసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. వారిద్దరి సారథ్యంలో గత నాలుగేళ్లలో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ పాగా వేసిన మాట వాస్తవమే. అదే సమయంలో ఢిల్లీ , బీహార్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకోలేకపోయిందన్న చేదు నిజాన్ని విస్మరించలేం. ముఖ్యంగా ఇటీవల లోక్ సభ ఉప ఎన్నికల్లో వరుస వైఫల్యాల నేపథ్యంలో మోదీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యంగా గురుదాస్ పూర్ (పంజాబ్) యూపీలోని గొరఖ్ పూర్, ఫూల్ పూర్, కైరానా లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటమితో కమలనాధులు కుంగిపోయిన మాటను కాదనలేం. పైకి కాదనుకున్నా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని కొట్టి పారేయలేం. స్వామిభక్తుల్లో సయితం ఒకింత నమ్మకం సడలిన విషయాన్ని అంత తేలిగ్గా తోసిపుచ్చలేం.ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్ సమావేశంలో ఈ అంశంపైనే విస్తృత చర్చ జరిగింది. బీజేపీ మాతృక అయిన ఆర్ఎస్ఎస్ సమావేశం లో ఆందోళన వ్యక్తమయింది. హర్యానాలోని సూరజ్ కుండ్ లో జరగిన ఈ సమావేశం దేశ తాజా రాజకీయ పరిస్థితిపై లోతైన అధ్యయనం చేసింది. మోదీ ప్రభావం నిజంగానే మసక బారిందా? ప్రభుత్వం ప్రజలకు చేరువ కాలేకపోతుందా? వివిధ వర్గాల ప్రజలు క్రమంగా పార్టీకి దూరమవుతున్నారా? ఇందుకు కారణాలేంటి? ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నఅంశంపై అంతర్గతంగా సమీక్షించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ, సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణ గోపాల్, బీజేపీ యువకిశోరాలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్ మాధవ్, పి.మురళీధరరావు, ప్రధాన కార్యదర్శులు హాజరైన ఈ సమావేశం నిజాయితీగానే పరిస్థితిని అధ్యయనం చేసింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన భారతీయ మజ్దూర్ సంఘ్,సేవా భారతి, భారతీయ కిసాన్ సంఘ్, లఘు ఉద్యోగ్ భారతీ, స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో చివరి రోజు అమిత్ షా పాల్గొన్నారు.ప్రభుత్వంపై ప్రజలు, ముఖ్యంగా సామాన్య ప్రజల మనోభావాలను ఆర్ఎస్ఎస్ ద్వారా తెలుసుకునేందుకు ఈ బేటీని నిర్వహించారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని, ఎత్తుగడలను ఖరారు సమావేశం దోహదపడింది. మొత్తానికి మోదీ ప్రభ మసకబారిన చేదునిజాన్ని అంగీకరించింది. అదే సమయంలో విశ్వసనీయత చెక్కు చెదరలేదని చెప్పుకుంది. 2014 నాటి ఆకర్షణ శక్తి అటు పార్టీలో, ఇటు మోదీలో కొరవడిందన్న వాస్తవాన్ని గుర్తించింది. ముఖ్యంగా దళితులు, వెనకబడిన వర్గాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు అభిప్రాయపడింది. విపక్షాల దుష్ప్రచారం కూడా ఇందుకు దోహదపడిందని అదేపనిగా బాధపడింది. పార్టీకి ఆదినుంచి దన్నుగా నిలబడుతున్న వైశ్యులు, బ్రాహ్మణులు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల నష్టపోతున్నామన్న భావనలో ఉన్నారు. ఇక పెట్రో ఉత్పత్తుల సంగతి సరేసరి. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజల్లో కనపడుతోంది. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ సమావేశం సమీక్షించింది. మొత్తానికి సరిదిద్దుకోవల్సిన అంశాలు అనేకం ఉన్నాయని గ్రహించింది. రైతులు వివిధ వర్గాల సంక్షేమం కూడా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రచారం లోపించిందని, అవి క్షేత్రస్థాయి ప్రజలకు చేరడం లేదని భావించింది. విపక్ష పాలిత రాష్ట్రాలను పక్కన పెడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా ఈ పరిస్థితి కొనసాగరాదని పేర్కొంది. మొత్తం మీద మోదీ ప్రభావం తగ్గిన మాట వాస్తవమే అయినప్పటికీ, అది ప్రమాదరకర స్థాయిలో లేదని భావిస్తోంది. లోపాలను సరిచేసుకుంటే ఎర్రకోటను కాపాడుకోవడం కష్టమేమీ కాదన్న అభిప్రాయంతో సంఘ్ పరివార్ వర్గాలు ఉన్నాయి.