YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆనంకు కళ్లెం..?

ఆనంకు కళ్లెం..?
టీడీపీని వీడి వెళ్తూ.. తన వర్గాన్ని వెంట తీసుకువెళ్లాలన్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రయత్నాలకు బ్రేక్‌ వేసేందుకు టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. ఆనం చర్యల వల్ల జరగబోయే నష్టాన్ని నివారించే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఇన్‌చార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో పలువురు అసంతృప్త నేతలతో చర్చలు జరిపారు. అలాగే నెలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఆదాల ప్రభాకరరెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆనం రామనారాయణరెడ్డి కదలికలతో జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆనం రామనారాయణరెడ్డి జిల్లా వ్యాప్తంగా తన వెంట పలు వురిని తీసుకెళ్లడానికి పావులు కదుపుతుండగా, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తెలుగుదేశం సన్నద్ధమ యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆది, సోమవారాల్లో జిల్లా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి లతో సీఎం సమావేశమై ప్రస్తుత పరిస్థితిల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. నెలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను ఆదాల ప్రభాకరరెడ్డికి అప్పగించారు. దీంతో ఆదాల రంగంలోకి దిగి ఆనం చర్యల వల్ల జరగబోయే నష్టాన్ని నివారించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించే పనులు మొదలు పెట్టారు. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.
పార్టీ మారుతున్న దృష్ట్యా ఆనం తెలుగుదేశానికి నష్టం చేసే అవకాశం ఉందనే విషయాన్ని పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, ఇన్‌చార్జి మంత్రి అమరనాథ్‌రెడ్డి, పార్లమెంట్‌ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకరరెడ్డిని రాజధానికి పిలిపించుకొని చర్చించారు. గురువారం రోజు నెల్లూరులో ఆదాల, సోమిరెడ్డి రహస్యంగా బేటీ అయ్యారు. మంత్రి సోమిరెడ్డిపై ఆదాల అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఉంది. దీనిని పరిష్కరించుకోవడం కోసం సోమిరెడ్డి ఆదాల నివాసానికి వెళ్లి గంట సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం అదే రోజు రాజధానిలో ఆదాల, మంత్రులు సోమిరెడ్డి, నారాయణ, అమరనాథరెడ్డి సమావేశమయ్యారు. శుక్రవారం అమర్‌ను, ఆదాల ప్రభాకరరెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదాల తన మనసులోని కోర్కెలను, ఆవేదనలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
వీటన్నింటిని సావధానంగా విన్న సీఎం ఆదాలకు పూర్తి భరోసాతో పాటు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో పార్టీ వ్యవహారాలను మీరే చక్కదిద్దాలని, పార్టీకి నష్టం జరగకుండా నిలువరించాలని చంద్రబాబు ఆదాలను కోరినట్లు తెలిసింది. ఈ భేటీ తరువాత ఆదాల ప్రభాకరరెడ్డి మంగళవారం నుంచి రంగంలోకి దిగారు. ఆనం రామనారాయణరెడ్డి ప్రభావం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్‌ పరిధిలో ఆనం వెంట నడిచే అవకాశం ఉన్న మండల, గ్రామ స్థాయి నాయకులను కలిసి వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మరోవైపు మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలపై దృష్టి సారించారు. సోమవారం సూళ్లూరుపేట నాయకుడు వాకాటి ముఖ్య అనుచరుడైన హర్షవర్థన్‌రెడ్డితో సోమిరెడ్డి, అమరనాథరెడ్డి భేటీ అయ్యారు. గురువారం బెంగళూరులోని పరప్పర అగ్రహారం కారాగారంలో ఉన్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని మంత్రి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, నియోజవకర్గ ఇన్‌చార్జి పరసారత్నం కలిసి సుమారు రెండు గంటల పాటు చర్చించారు. కేసు విషయంలో తనకు న్యాయం చేయలేదనే అసంతృప్తితో ఉన్న వాకాటితో ఏకాంతంగా చర్చలు జరిపారు. వైకాటి వర్గం వైసీపీలోకి వెళ్లబోతోందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారిని నిలువరించే కార్యక్రమంలో భాగంగా వాకాటిని బుజ్జగించే ప్రయత్నం చేశారు.
ఇటీవల ఆనం అనుచరుడు, డీసీసీబీ చైర్మన్‌ మెట్టకూరు ధనంజయరెడ్డి, రాపూరుకు చెందిన చెన్ను బాలకృష్ణారెడ్డిలతో మంత్రి సోమిరెడ్డి బెంగళూరులో సమావేశం అయ్యారు. అలాగే కోవూరు నాయకుడు పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డినీ బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. పార్టీకి ఎంతో సేవ చేసిన తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే ఉద్దేశంతో పార్టీ మారడానికి నిర్ణయించుకున్న పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి మనసు మార్చే బాధ్యతను రాష్ట్ర పార్టీ మంత్రి సోమిరెడ్డికి అప్పగించింది. ఈ క్రమంలో శనివారం సోమవారం సోమిరెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డితో చర్చించి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ భేటీకి ముందు అమరనాధరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి కూడా పెళ్లకూరుతో మాట్లాడి పార్టీ మారే యోచనను విరమించుకోవాలని నచ్చజెప్పినట్లు తెలిసింది.

Related Posts