రాజకీయ చైతన్యానికి ప్రతీక అయిన విజయవాడలో.. జాతీయ పార్టీలకు సారథులు లేక బోసిపోతున్నాయి. నగరంలో ఆపార్టీలను నడిపించే నాయకులే కానరావడం లేదు. విజయవాడలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేడు పార్టీ అధ్యక్షుడిని సైతం నియమించుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. నగరాధ్యక్షుడు లేక వెలవెలబోతోంది. ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకి నగరాధ్యక్షుడు ఉన్నా.. ఆయన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద నగరంలో టీడీపీ ఒక్కటే కాస్త కళకళలాడుతోంది. మిగిలిన ప్రధాన పార్టీలన్నీ సరైన సారథ్యం లేక రాష్ట్ర స్థాయి నాయకుల దిశానిర్దేశం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
ఎన్నికల కాలం దగ్గర పడుతోంది. ఇలాంటి కీలకమైన పరిస్థితుల్లో నగరంలో ప్రధాన పార్టీలకు అధ్యక్షులు లేకపోవడం ఆ పార్టీల కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని రాజధాని ప్రాంతంలో ప్రధాన నగరమైన విజయవాడలో సరైన దారి చూపే సత్తా ఉన్న నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రావాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సారథులు కావాలంటున్నారు.
ఒకప్పుడు నగరంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టే ఉండేది. 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపొందింది. 2005 కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 59 స్థానాలకుగాను 29 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆపార్టీతో పొత్తు పెట్టుకున్న వామపక్షాలు 17 స్థానాలు దక్కించుకున్నాయి. అలాంటి చర్రిత ఉన్న కాంగ్రెస్ నేడు నగరాధ్యక్షుడు లేక వెలవెలబోతోంది. ఆ పార్టీ నగర అధ్యక్షుడిగా 2013 నుంచి 2015 వరకు అడపా నాగేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మీసాల రాజేశ్వరరావు పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు మల్లాది విష్ణు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయన వైసీపీలోకి వెళ్లడంతో ఆకుల శ్రీనివాసకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈయన కేవలం 10 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరినీ నియమించలేదు. ప్రభుత్వ విధానాలపై మాట్లాడాలన్నా.. ఏదైనా ధర్నాలు నిర్వహించాలన్నా నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి నగరంలో మద్దతుదారుల సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. 1999లో విజయవాడ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటుడు కోట శ్రీనివాసరావు గెలుపొందారు. తర్వాత పార్టీ శ్రేణులను నడిపించే నాయకత్వం కొరవడింది. దాదాపు రెండేళ్లుగా బీజేపీ నగరాధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఆ పార్టీ నగరాధ్యక్షుడిగా 2013 నుంచి 2016 అక్టోబరు వరకు దాసం ఉమామహేశ్వరరాజు పనిచేశారు. ఆ తర్వాత ఎవరినీ నియమించలేదు.
నగర పరిధిలో మిగిలిన పార్టీలతో పోలిస్తే టీడీపీ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ఐదేళ్లుగా పార్టీ నగర అధ్యక్షుడిగా బుద్ధా వెంకన్నే కొనసాగుతున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత సుదీర్ఘకాలం నగర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన వారు లేరు. పార్టీ నగర అధ్యక్షుడిగా 2013లో వెంకన్న బాధ్యతలు స్వీకరించారు. తర్వాత వచ్చిన కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 59 స్థానాల్లో 39 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే జరిగిన సాధారణ ఎన్నికల్లో నగరంలో రెండు నియోజకవర్గాలను. టీడీపీ కైవసం చేసుకుంది. పశ్చిమం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన జలీల్‌ఖాన్ సైతం టీడీపీలో చేరి పోయారు. వీటన్నింటి లోనూ వెంకన్న కృషి ఉంది. వైసీపీ, బీజేపీ నిర్వహించే ఆందోళనలకు ధీటుగా జవాబివ్వడంలో వెంకన్న ముందుంటున్నారు. ఇటీవల తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ శ్రీధర్ నడుమ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించారు. ట్రబుల్ షూటర్‌గా అధిష్ఠానం దృష్టిని ఆకర్షించారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ నగర అధ్యక్షుడిగా జలీల్‌ఖాన్ ఉండేవారు. 2016లో ఆయన టీడీపీలోకి వచ్చేవరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం వంగవీటి రాధాకృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆయన 2017 వరకు ఆ పదవిలో ఉన్నారు. అనంతరం నగర అధ్యక్షుడిగా వెలంపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి సరైన సహకారం లభించడం లేదు. ముఖ్యంగా వెలంపల్లి వర్గానికి వంగవీటి రాధా వర్గానికి నడుమ అసలు పొసగడం లేదు. దీంతో నగరంలో వైసీపీ శ్రేణులు ఎవరి దారిన వారు కార్యక్రమాలు నిర్వహించు కుంటున్నారు. ఇలాంటి పరిస్థితిపై కార్యకర్తలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.