వట్టివాగు ఆధునీకరణకు రూ.75 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపగా, నేటికి ఎలాంటి ఆమోదం లభించలేదు. బడ్జెట్‌లో రూ.30 కోట్లు కాలువల ఆధునీకరణకు కేటాయించినా, ప్రస్తుతం ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. దీంతో ఈ ఖరీఫ్‌లో సాగునీరందించే విషయంలో అన్నదాతల ఆశలు అడుగంటుతున్నాయి.ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. విత్తనాలు విత్తే పనుల్లో అన్నదాతలు తలమునకలై ఉన్నారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన కుమురం భీం, జగన్నాథ్‌పూర్, వట్టివాగులు 84 వేల ఎకరాల ఆయకట్టును కలిగి ఉన్నాయి. ఇందులో కుమురం భీం, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు కాలువల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. వట్టివాగు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి తరహాలోనే ఉంది. 20 సంవత్సరాల క్రితం నిర్మించిన శిథిలకాలువల వల్ల 15 వేల ఎకరాల ఆయకట్టులో 1000 ఎకరాలకు సైతం వట్టివాగు తడపడం లేదు. బడ్జెట్‌లో రూ.30 కోట్లు కేటాయించినా, నేటికి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఇక వర్షాలు వరుసకడితే ఏ ప్రాజెక్టు కాలువల పనులు ముందుకు కదలవు. రూ.89 కోట్ల వ్యయంతో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 2001 సంవత్సరంలో వట్టివాగును నిర్మించారు. ప్రస్తుతం కాలువలన్నీ నామరూపాల్లేకుండా శిథిలమయ్యాయి. 16 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీళ్లు అందిస్తామనే అధికారులు వల్లేవేస్తుండడం వల్ల అన్నదాతలు పెదవి విరుస్తున్నారు.రూ.651 కోట్ల వ్యయం(పునరావాసం, భూసేకరణ, కాలువల, జలాశయ నిర్మాణం)తో నిర్మించిన కుమురం భీం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా 39,500 ఎకరాలు, కుడికాలువ ద్వారా 6 వేల ఎకరాలను ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్మించారు. పంపిణీ కాలువలను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఆయకట్టు రైతులకు ఎన్నడూ సాగు నీరందడం లేదు. కాగజ్‌నగర్ డివిజన్‌లో పంపిణీ కాలువల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు. ఎడమకాలువ వెళ్లే మార్గంలో కాజీపేట-బల్లార్ష రైలు లైన్ వద్ద అనుమతుల కోసం నీటి పారుదల శాఖ, అటవీశాఖ వద్ద రూ.12.75 కోట్లు డిపాజిట్ చేసినా, అనుమతుల విషయంలో జాప్యం సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. కుడి కాలువ ఆరు వేల ఎకరాలకు సాగు నీరందించేలా ఏడు కిలోమీటర్ల మేర ప్రస్తుతం పూర్తయింది. లైనింగ్ పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఈ కాలువ నిర్మాణానికి నాసిరకమైన, స్థానికంగా లభించే ఇసుకను వాడడం, క్యూరింగ్ లేకపోవడం వల్ల పనులు జరుగుతుండగానే మరోవైపు పగుళ్లు తేలుతున్నాయి. ఎడమకాలువ సైతం చాలా చోట్ల లైనింగ్ దెబ్బతింది.