రాయలసీమ..కొన్ని దశాబ్దాలుగా వెనుకబడి ఉంది. వర్షాభావంతో ఒకప్పుడు సిరులు పండిన ఈ ప్రాంతం వట్టిపోయింది. ఈ ప్రాంతం మళ్లీ కళకళలాడాలంటే స్టీల్ పరిశ్రమే ఆధారం. ఇంతటి కీలకమైన ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం నో చెప్పేసింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదంటోంది. కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ అయితే ఏకంగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు ఎంతో ముఖ్యం. రాయల సీమలో ... వరుణుడు మోహం చాటేయంటో.. వ్యవసాయం క్షీణించిపోయింది. పరిశ్రమలైనా వస్తాయనుకుంటే కేంద్ర ప్రభుత్వ చేయూత లేకపోవడంతో అవీ ఆమడదూరంలోనే నిలిచిపోతున్నాయి. స్టీల్ ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ సమస్య అదుపులో ఉంటుందని భావించారు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకోసం పోరాడినట్లుగా... కడప ఉక్కు కోసం పోరు సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్రంలో ఆవేదన. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కుదరదని కేంద్రం స్పష్టంచేయగానే అందరూ నిర్ఘాంతపోయిన పరిస్థితి. కేంద్రప్రభుత్వం నవ్యాంధ్రపై కత్తిగట్టినట్లు వ్యవహరిస్తుండడంతో ప్రజల్లో అసంతృప్తి. ఆవేశం. ఈ నిర్లక్ష్యం, నిర్లిప్తతను తట్టుకోలేకే.. సీఎం రమేష్ పోరు బాట పట్టారు. న్యాయబద్ధమైన ఆంధ్రవాసుల డిమాండ్ కడప స్టీల్ ప్లాంట్. విభజన చట్టంలోనూ ఈ పరిశ్రమను పొందుపరిచారు. తక్షణమే కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుచేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టారు.
రాయలసీమలో కరువు ఎక్కువ. అయితే నాణ్యమైన భూమి, ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ఈ ప్రాంతం ఉక్కు పరిశ్రమ స్థాపనకు అనుకూలమని శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేకాక రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు విభజన చట్టంలోనూ పొందుపరిచారు. విభజన చట్టం-2014లోని షెడ్యూల్-13లో కడప సమీకృత ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇప్పుడు ఆ ఉసేలేదు. దీంతో కడప ఉక్కు పరిశ్రమ కోసం తాను సమిధగా మారేందుకైనా సిద్ధమంటున్నారు సిఎం రమేష్. కడప బేసిన్‌లో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కడపకు ఖనిజ నిక్షేపాల ఖిల్లాగా పేరుంది. ఉక్కుతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాది అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. సుమారు పదిమిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల...ఫ్యాక్టరీ నిర్మిస్తే 20వేల మందికి ప్రత్యక్షంగా, అనుబంధ పరిశ్రమల ద్వారా 70వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. స్టీల్ ప్లాంట్ సాకారమైతే.. రాయలసీమలో ఉపాధి వలసలు తగ్గిపోతాయి. అందుకే.. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ వాసులు పట్టుబడుతున్నారు. ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు సీఎం రమేష్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడ్డారు. ఆమరణ దీక్ష చేపట్టారు.