ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం, మాజీ ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరునున్నారా? కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయినట్లు తెలిసింది. ఆయన రాకను ఆహ్వానించిన రాహుల్.. రాష్ట్ర పీసీసీ బాధ్యతలు చేపట్టాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.ఈ విషయంలో కొంత అస్పష్టత ఉన్న ఇటీవల విజయవాడలో పర్యటించిన ఏపీ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ కిరణ్ రాకను ఆహ్వానించినట్లు తెలిసింది. వాస్తవానికి.. తన రాజకీయ గురువు, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం సలహా, సూచనతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి పునఃప్రవేశం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌లో తిరిగి చేరాలని చిదంబరం సూచించినట్లు తెలిసింది. రానున్న పది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిరణ్‌కుమార్ రెడ్డి చేరిక వ్యవహారం మరి కొద్ది రోజుల్లోనే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు పూర్వవైభవం కలుగుతుందనే ఆశాభావం కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది.అయితే.. కిరణ్ పునరాగమనం పట్ల ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యతిరేకత వ్యక్తం చేయకపోయినా.. కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. కిరణ్‌కుమార్‌కు ప్రజాదరణ లేదని, ఆయన చరిష్మా ఉన్న నేత కాదని, కేవలం ఆయనకు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉందని రఘువీరారెడ్డి అంటున్నారని తెలిసింది. రాష్ట్ర విభజన అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ‘జై సమైక్యాంధ్ర’ పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు.ప్రస్తుతం ఆ పార్టీలో కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు తిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్ కూడా టీడీపీలో చేరిపోయారు. కిరణ్‌కు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినా ప్రాంతీయ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ నేత పురందేశ్వరితోనూ చర్చలు జరిపినట్లు తెలిసింది. కానీ.. అవేమి పలఫ్రదం అవలేదు. ఇటీవల తన స్వగ్రామం నగిరిపల్లికి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితులను సంప్రదించినట్లు తెలిసింది. వారందరూ కూడా కాంగ్రెస్‌లో మళ్లీ చేరాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.