దేశంలో మళ్లీ ముందస్తు పవనాలు వీస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. రోజురోజుకూ ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుండటం, ఎన్నో ఆశలతో గద్దెనెక్కిన మోడీ.. కేవలం మాటల ప్రధానిగా మిగిలిపోయారనే అపకీర్తి మూటగట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ముందస్తు చర్చ తెరపైకి వచ్చింది. సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే ఎన్నికల నగారా మోగించేందుకు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సిద్ధమవుతున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న సంకేతాలు నిశితంగా పరిశీలిస్తున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తదనుగుణంగా పావులు కదుపుతున్నారు. అయితే ముందస్తుగా వెళ్లేందుకు మోడీ ఎందుకింత ఉత్సాహం చూపుతున్నారు? దీని వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయా? అనే సందేహాలు ఉన్నాయి. ఉన్నాయంటున్నారు విశ్లేషకులుదేశంలో నవంబర్, డిసెంబర్‌లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే పార్లమెం టు ఎన్నికలు కూడా నిర్వహించేందుకు మోడీ-షా సిద్ధమవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందనేందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శన మని తేలిపోయింది. దీంతో విడివిడిగా ఎన్నికలకు వెళితే అది తమను ముంచేస్తుందని మోడీ-షా ఆందోళన చెందుతున్నారట.ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో బీజేపీ సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉంది. దీంతో అక్కడ వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. రాజస్థాన్‌లో ఐదేళ్ల కిందటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. తీవ్రమైన అధికార వ్యతిరేకతను అక్కడి వసుంధర రాజే ప్రభుత్వం మూటగట్టుకుంది. ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లో అయితే ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి బీజేపీయే అధికారంలో ఉంది. ఇక ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం ఉంది. అది కూడా బీజేపీని టెన్షన్ పెడుతోంది. రాజస్థాన్‌లో సచిన్‌ఫైలట్, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింథియాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాగా బలంగా పుంజుకుంది.ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలలో కలిసి బీజేపీకి 63 సీట్లు వచ్చాయి. ఈ రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత మూడు నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు వస్తే.. ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. విడివిడిగా ఎన్నికలు జరిగితే ఈ సీట్లలో భారీగా కోత పడుతుంది. అదే జరిగితే.. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం. మరోపక్క కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో బలంగా ఉంది. ఈ రాష్ట్రా ల్లో జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ఫామ్‌లోకి వచ్చింది. గుజరాత్ ఎన్నికల నుంచి కాం గ్రెస్‌కు కొంత పాజిటివ్ వాతావరణం కనిపిస్తోంది. గుజరాత్‌లో మోడీని ఢీకొట్టేంత నేతలు లేకపోయినా.. నైతిక విజయం సాధించింది. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘఢ్‌లో కాంగ్రెస్‌కి బలమైన నేతలున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత మోడీ తప్ప దేశాన్ని ఎవరూ కాపాడలేరు అన్నంత రేంజ్‌లో ఆ పార్టీ నేతలు ఆకాశానికి ఎత్తేశారు. ఇందుకు తగ్గట్లుగా బీజేపీ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు నమోదు చేసింది. కానీ ఉప ఎన్నికల్లో మాత్రం వరుసగా ఓడిపోతూ వస్తోంది. దీంతో మోడీ ఇమేజ్ డ్యామేజ్ అవుతూ వస్తోంది. ఏడాది చివరిలో జరగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతే మోడీ మానియా అనేదే అసలు లేదన్న అభిప్రాయం అంతటా వ్యాపిస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇది బీజేపీని, మోడీని ఇరుకున పెట్టే అంశమే!ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా పుంజుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం. ఉత్తరాదిలో ఎస్పీ, బీఎస్పీ.. బలం పెరుగుతోంది. ఈ పార్టీలన్నీబీజేపీని వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నాయి. అందుకే కాంగ్రెస్ బలం పెరగకుండా.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో బీజేపీ ఉందంటున్నారు విశ్లేషకులు!