విశాఖ వుడా మరో ప్రైవేటు పార్టీతో కలిసి అభివృద్ధి పరచిన దాకమర్రి లేఅవుట్ ప్లాట్‌ల విక్రయంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్లాట్ ధర చదరపు గజానికి రూ.9000 నిర్ణయించగా, ప్లాట్‌లు కొనుగోలు చేసిన లబ్దిదారులు ధర ఎక్కువగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాము ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వైస్‌ఛైర్మన్ పట్నాల బసంత్ కుమార్ ప్రకటించారు. ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సెక్షన్ 47 ప్రకారం మినహాయింపు తెచ్చుకునే ప్రయత్నం జరగుతోందని వెల్లడించారు. అయితే వుడా భాగస్వామిగా ఉన్న ప్రైవేటు కంపెనీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ప్రతిష్టంభన నెలకొందన్నారు. నగర శివారు అగనంపూడి సమీపంలో భారీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయన్నారు. గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల పరిధిలోని అగనంపూడి, పెదముషిడివాడ, ఈ మర్రిపాలెం, నంగినారపాడు, గంగవరం గ్రామాల్లో 900 ఎకరాల భూములను ఇప్పటికే గుర్తించామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు 25వేల ఇళ్ల నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేయాలన్నది ప్రణాళికగా పేర్కొన్నారు. వుడా నిర్మించిన రో హౌసింగ్‌ను వినియోగంలోకి తెచ్చే క్రమంలో కొన్ని యూనిట్లు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నామన్నారు. గతంలో ఎంహెచ్‌ఆర్‌డీ శిక్షణ తరగతులకు కొన్ని ప్లాట్‌లు ఇవ్వగా, ఆయుష్ ఆధ్వర్యంలో అమృత్ ప్రాజెక్టు కింద చేపట్టే హెల్త్ టూరిజం నిమిత్తం రో హౌసింగ్‌లో 11 ప్లాట్‌లను కేటాయించామన్నారు. ఈ నెల 21న సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు. వుడా చేపట్టనున్న మరో భారీ ప్రాజెక్టు బీచ్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చామని, 21న సీఎంకు ప్రతిపాదనలు వివరించి ఆమోదం పొందే ప్రయత్నం జరుగుతోందన్నారు. మధురవాడలో ఐటీ హబ్ ఏర్పాటుకు సంబంధించి 22 ఎకరాల్లో మాస్టర్‌ప్లాన్ రూపకల్పన జరుగుతోందన్నారు. ప్రైవేటు రంగంలో పీపీపీ విధానంలో చేపట్టాలా లేక ఎస్‌పీవీ ఏర్పాటు చేయాలా అన్న అంశంపై సందిగ్ధత నెలకొందన్నారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు దుబాయ్, జపాన్ తదితర దేశాలకు చెందిన సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు.