స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఈ నెల 29వ తేదీన జరగనున్న కడప జిల్లా బంద్‌కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించాయి. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రదర్శనలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు నిర్ణయించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఒకటని, ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బీజేపీ ఈ విషయంలోనూ మొండిచెయ్యి చూపించిందన్నారు. చట్టంలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రులకు ప్రత్యేక ప్యాకేజీ పేర్కొన్నప్పటికీ ఈ సంవత్సరం బడ్జెట్‌లో దాన్ని బుట్టదాఖలు చేసిందన్నారు. తాజాగా సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణాలోని బయ్యారంలోని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందంటూ బీజేపీ నాయకులు మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఈ నెల 29వ తేదీన కడప బంద్‌కు మద్దతుగా వాడవాడలా ప్రదర్శనలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.