YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్రమాలు ఇందిరమ్మకెరుక..

అక్రమాలు ఇందిరమ్మకెరుక..
ఇందిరమ్మ ఇళ్లలో నెలకొన్న అక్రమాలపై అధికారులు అంతర్గత విచారణలతో సరిపెట్టేసి నామమాత్రపు చర్యలతో నెట్టుకొచ్చేస్తున్నారు. ఇదే అదనుగా ప్రస్తుత ఎన్టీఆర్‌  గృహ నిర్మాణ పథకంలోనూ మరికొందరు వసూళ్లకు తెగబడుతున్నారు. జన్మభూమి కమిటీలతో జత కలిసి ఇళ్లు మంజూరు చేయిస్తామని.. బిల్లులు సకాలంలో అందిస్తామని దండుకుంటూ సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నారు.
పథకం పేదోడికి.. లబ్ధి పెద్దోడికి అన్నట్లు సాగింది గత ప్రభుత్వ హయాంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణం తీరు. పేదోళ్ల పేరుతో పక్కా ఇళ్లను పెద్దలే గద్దల్లా తన్నుకుపోయారు. రాజకీయ ఎత్తుగడలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తమ పనికానిచ్చేశారు. అనర్హులను అర్హులుగా జాబితాల్లోకి ఎక్కించారు.. ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించారు.. పాత ఇళ్లకు రంగులేసి కొత్తవిగా కలరింగిచ్చి రూ. కోట్ల పక్కదారి పట్టించారు. అప్పట్లో అధికార పార్టీకి తలొంచి అధికారులే అక్రమాలకు దగ్గరుండి మరీ తెరలేపారు. నేతలతో చేతులు కలిపి నాకింత.. నీకింత అంటూ వాటాలు పంచేసుకున్నారు. జిల్లాలో 2014కు ముందు పేదల పేరిట 5.76 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి.
ఇందిరమ్మ పథకం, జీవో నం. 111, 33, 44 ద్వారానే లక్షల్లో గృహాలు మంజురు చేశారు. వీటిలో ఒకే నిర్మాణానికి రెండు గృహాలుగా చెల్లింపులు చేయడం, పాత ఇళ్లకు చెల్లింపులు.. ఇటుక కూడా పేర్చకుండానే దస్త్రాల్లో పూర్తయినట్లు చూపి నిధులు మింగేశారు. అలా జిల్లావ్యాప్తంగా 76,678 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అక్రమం`గా నిధులు నొక్కేసినట్లు జియోట్యాగింగ్‌ ద్వారా గుర్తించగలిగారు. అయితే వీటిలో ఎక్కువ మొత్తం నాటి నేతల ఖాతాల్లోకే మళ్లిపోయాయి. వారికి వత్తాసు పలికిన గృహనిర్మాణ సిబ్బంది.. పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపిన అధికారులు ఈ అక్రమాల్లో ఇరుక్కుపోయారు. వీరిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని గత రెండేళ్లుగా చెబుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. కొందరు అధికారులు లోపాయికారి విచారణలు.. మొక్కుబడి చర్యలతో నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొందరు.. మిగతా 15లో ఇదిగో ఇంటి గుట్టు..దేవరాపల్లి మండలం చింతలపూడిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఇదివరకే గుర్తించారు. ఇళ్లు కట్టకుండానే బిల్లులు చేసేసుకున్నారు. గృహనిర్మాణ సిమెంట్‌ను పక్కదారి పట్టించి అమ్మేసుకున్నారు. రూ.లక్షల్లో నిధులు స్వాహా అయినట్లు శాఖాపరంగా జరిగిన విచారణలో కనుగొన్నారు. మండల ప్రత్యేకాధికారి నిర్లక్ష్యంతో పాటు గృహనిర్మాణ సిబ్బంది, అధికారులను ఇందుకు బాధ్యులను చేశారు. క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించే వేళ ఓ ఉన్నతాధికారితో ఉన్న బంధుత్వాన్ని చూపించి విచారణను నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు.
రోలుగుంట మండలం కొవ్వూరులో 26 ఇందిరమ్మ ఇళ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించేశారు. దీనిపై గృహనిర్మాణ సంస్థ ఉన్నతాధికారి శ్రీరాములు ఇటీవలే విచారణ జరిపి ఒక డీఈ, ఇద్దరు ఏఈలను ఇందుకు బాధ్యులుగా గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు పక్షం రోజులు గడువు కావాలని కోరడంతో విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. 
ఎలమంచిలి మండలం పెదపల్లిలో ఇందిరమ్మ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ జరిగింది. లేని ఇళ్లకు బిల్లులు చేయడం.. ఉన్న ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా అట్టిపెట్టుకోవడాన్ని గుర్తించారు. పర్యవేక్షించాల్సిన డీఈ, క్షేత్రస్థాయిలో పనులు చేయించే ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లపైనా చర్యలకు సిఫార్సు చేశారు.ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. దేవరాపల్లి, రోలుగుంట, నర్సీపట్నం, ఎలమంచిలి, బుచ్చెయ్యపేట, నక్కపల్లి మండలాల్లో అక్రమాలపై ప్రాథమిక విచారణలు పూర్తిచేసిన అధికారులు 12 మంది గృహనిర్మాణ సిబ్బందిపై అభియోగాలు నమోదు చేసి వారిచ్చే వివరణల ఆధారంగా మరోసారి విచారణకు ఆదేశించడానికి సిద్ధమవుతున్నారు. హుకుంపేట మండలంలో సబ్‌కలెక్టర్‌కు కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాల్లో అధికారులు మామూళ్లు వసూళ్లు చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవలే అక్కడి గృహనిర్మాణ శాఖ ఏఈని కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే పక్షం రోజులు తిరగకుండానే మరలా అతనికి క్లిన్‌చిట్‌ ఇచ్చి జి.మాడుగుల మండలంలో ఏఈగా నియమించడం విశేషం. 
ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై అంతర్గత, విజిలెన్స్‌ విచారణలు చేసి బాధ్యులను గుర్తిస్తున్నా వారిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. నేతలతో ఒత్తిళ్లు తీసుకురావడం.. ఉన్నతాధికారులకు వాటాలు ఆశ చూపడంతో పూర్తయిన విచారణలను సైతం తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవరాపల్లి మండలంలో ఇందిరమ్మ అక్రమాలపై ఏడాది క్రితమే నివేదిక సిద్ధమైనా వారిపై పూర్తి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఇటీవల శ్రీరాములయ్య నిర్వహించిన రోలుగుంట విచారణను కూడా తొక్కిపెట్టేందకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related Posts