YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

గర్భనిరోధక పద్ధతులు అంతంతే..

గర్భనిరోధక పద్ధతులు అంతంతే..

- మగవాళ్లు వాడితే లాభం లేదు.

- కుటుంబ నియంత్రణవైపు మగువల చూపు...

అత్యధికంగా కండోమ్‌లవైపు మొగ్గు..

- పెళ్లికాని యువతులకే కండోమ్‌లపై ఆసక్తి

ప్రపంచమంతా ఆధునిక పోకడలు పోతున్నా పలువురు మహిళలు మాత్రం ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడట్లేదని సర్వే తేల్చింది. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కు్ల్లో కేవలం 10 శాతం మందే ఆధునిక గర్భనిరోధక సాధనాల వైపు దృష్టి సారిస్తున్నారని పేర్కొంది. కండోమ్ వాడకం, కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక మాత్రలు, ఇంట్రా యుటెరైన్ పరికరాలు (ఐయూడీ)ల కన్నా.. సంప్రదాయ పద్ధతులవైపే వారు మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది. గర్భం రాకుండా నెలసరికి అనుగుణంగానే శృంగారంలో పాల్గొంటున్న మహిళలే అధికమని పేర్కొంది. ఇక, ఎన్ని అవగాహనలు కల్పించినా, రక్షణాత్మక శృంగారంలో పాల్గొంటున్నా.. వివాహితల్లో గర్భ నిరోధక రేట్ (సీపీఆర్) కేవలం 54 శాతమేనని తేల్చింది. అయితే, పెళ్లి కాని యువతులు మాత్రం అధికంగా ఆధునిక గర్భ నిరోధక సాధనాలపైనే ఆధారపడుతున్నారని సర్వేలో తేలింది. 25 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కులు అధికంగా అబార్షన్లు చేయించుకోవడం లేదంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైపు మొగ్గు చూపడం వంటివి చేస్తున్నారని తేలింది. గర్భ నిరోధక మాత్రలున్నా.. వాటిని వాడుతోంది మాత్రం 1 శాతం మంది మగువలేనని తేలింది. 

గర్భ నిరోధానికి, లైంగిక వ్యాధుల నివారణకు తొట్టతొలి ప్రాధాన్యం కండోమ్‌కే. ఇటీవలి కాలంలో వాటి వాడకం విపరీతంగా పెరిగిపోయిందట. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు వాటి వాడకం తారస్థాయికి చేరిందట. అందునా పెళ్లికాని యువతులే అత్యధికంగా వీటిని వాడుతున్నారట. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం 2015-16లో ఈ విషయం తేలింది. పదేళ్ల కాలంతో పోలిస్తే 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కులైన పెళ్లికాని మహిళల కండోమ్ వాడకం 2 శాతం నుంచి 12 శాతానికి పెరిగిందని సర్వే తేల్చింది. అందులోనూ అత్యధికంగా కండోమ్‌లను వాడుతోంది 20 నుంచి 24 ఏళ్ల యువతులేనని సర్వే తేల్చింది. ఇక, గర్భ నివారణ అనేది కేవలం ఆడవాళ్లకే అవసరమని 10 మందిలో ముగ్గురు పురుషులు భావిస్తున్నారని సర్వే తేల్చింది. 
ఇక, గర్భ నిరోధక సాధనాలు మగాడు వాడినంత మాత్రాన సత్ఫలితాలు రావని చాలా మంది మగాళ్లు విశ్వసిస్తున్నట్టు సర్వేలో తేలింది. కండోమ్‌ను సరిగ్గా వాడితే గర్భ నిరోధం సాధ్యమవుతుందని 61 శాతం మంది పురుషులు నమ్ముతుంటే.. 25 శాతం మంది మాత్రం కండోమ్ వల్ల కొన్ని సార్లు మాత్రమే ఫలితాలు కనిపిస్తాయని విశ్వసిస్తున్నారు. కాగా, మణిపూర్, బిహార్, మేఘాలయాల్లో ఆధునిక గర్భ నిరోధక సాధనాల వాడకం చాలా తక్కువగా ఉందని సర్వేలో తేలింది. ఆయా రాష్ట్రాల్లో కేవలం 24 శాతం మంది వాటిని వాడుతున్నట్టు పేర్కొంది. అత్యధికంగా పంజాబ్‌లో 76 శాతం వాడకం ఉన్నట్టు తేలింది. అదే కేంద్ర పాలిత ప్రాంతాలను తీసుకుంటే లక్షద్వీ్ప్‌లో (30 శాతం) అత్యల్పంగా, చండీగఢ్‌లో 974 శాతం) అత్యధికంగా ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడుతున్నట్టు ఆరోగ్య సర్వేలో బయటపడింది. వర్గాల వారీగా తీసుకుంటే అత్యధికంగా సిక్కు, బౌద్ధ మహిళలు అత్యధికంగా 65 శాతం మంది ఆధునిక గర్భ నిరోధక సాధనాలు వాడుతున్నారు. అత్యల్పంగా ముస్లిం మహిళలు (38 శాతం) వాటిపై మొగ్గు చూపుతున్నట్టు సర్వే తేల్చింది. అదే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా వాటి వాడకంపై ప్రభావం చూపుతున్నట్టు తేలింది. అల్పాదాయ వర్గాల్లో 36 శాతం ఆధునిక గర్భ నిరోధక సాధనాలు వాడుతుంటే.. అధికాదాయ వర్గాల్లో మాత్రం ఆ వాడకం 53 శాతం దాకా ఉందని సర్వే తేల్చింది. 
ఆధునిక గర్భ నిరోధక సాధనాలు వాడుతున్న ప్రతి పది మంది మహిళల్లో ఏడుగురు ప్రభుత్వ ఆరోగ్య రంగం ద్వారా వాటి గురించి తెలుసుకున్నట్టు తేలింది. మరోవైపు కుటుంబ నియంత్రణ వైపు కూడా మహిళలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కుల్లో 67 శాతం మంది కుటుంబ నియంత్రణను కావాలని కోరుకుంటున్నారు. 11 శాతం మంది సంతానం మధ్య కాస్తంత గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారు. 55 శాతం మంది మాత్రం పరిమిత సంతానం వైపు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ నియంత్రణ సందేశాల గురించి తెలుసుకుంటున్న 72 శాతం మంది మహిళల్లో 59 శాతం మంది టీవీల ద్వారానే తెలుసుకున్నారని తేలింది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ ద్వారా 6,01,509 మందిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అందులో 98 శాతం మంది ఆయా వివరాలపై స్పందించారు.

Related Posts