సీఎం చంద్రబాబు 2016 వరకూ పోలవరం నిర్మాణాన్ని ఎందుకు ప్రారంభించలేదు? పట్టిసీమ ఎత్తిపోతల పధకం ఎందుకు కట్టారని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. విద్య నుంచి నీరు చెట్టు వరకూ ప్రతి పధకంలో అవినీతే. ఒక్క గృహనిర్మాణ పధకంలోనే 30 వేల కోట్ల అవినీతి జరిగిందని అయన ఆరోపించారు. ఏపీలో కనీ వినీ ఎరుగని అవినీతి జరుగుతోంది. దాన్ని మేము అంగీకరించనందునే ఎన్డీఏ నుంచి బయటకు పోయారు. బీజేపీ అవినీతిని సహించదు. తమ అవినీతి బయట పడకుండా హోదా, జోను, మతతత్వం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఏపీ లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికారపార్టీ అండతో పార్టీ నేతలు వేలకోట్లు తింటున్నారు. నిరుద్యోగులకు భృతి లేదు. తాత్కాలిక ఉద్యోగులకు జీతాల పెరుగుదల లేదు. కాంట్రాక్టు ఉద్యోగికి ఆరొందల జీతం పెరగదు. కానీ ముఖ్యమంత్రికి ఆరొందల రూపాయల వాటర్ బాటిల్ కావాలి. అభివృద్ధిలో రెండంకెలు దాటామంటారు. అదంతా తమ గొప్ప అంటారు. వెంటనే, హోదా లేనందున రాష్ట్రం వెనకబడిపోయిందంటారని అన్నారు. విశాఖలో విమ్స్ ఆస్పత్రికి నిధులివ్వరు. అమరావతికి అన్ని మెడికల్ కాలేజీలూ పట్టుకుపోతారు. తనను ప్రశ్నిస్తే ఆగ్రహిస్తారా? నాయీ బ్రాహ్మణుల మీద ఆయన భాష ఏమిటి? ఆ ఆగ్రహం, ఊగిపోవటం ఏమిటి? చంద్రబాబు కాదు, ప్రభుత్వమే కట్టుబాటు తప్పిపోతోందని అన్నారు. విశాఖకు హుద్ హుద్ నుంచీ నేటి వరకూ అందిన ప్రతి పైసా కేంద్ర బీజేపీ సర్కారుదే నని అయన అన్నారు.
కడప స్టీలుప్లాంటు కోసం సీఎం రమేష్ దీక్ష చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా. ఆయనకు రెండోసారి రాజ్యసభ ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. కడపలో ఏ పరపతీ లేని రమేష్ ని సీఎం ఒక్కడే మోస్తున్నాడు. కడప స్టీలు ప్లాంటు కోసం ఎవరూ కడుపులు మాడ్చుకోవద్దు. అదీ, విశాఖ రైల్వే జోనూ కూడా వచ్చి తీరుతాయని సోము వీర్రాజు అన్నారు. పరకాల ప్రభాకర్ కి ఇప్పుడే గుర్తొచ్చిందా తన భార్య కేంద్రమంత్రి అనీ ? ఆయన ఎందుకు రాజీనామా చేసిందీ ఆయనే చెప్పుకున్నాడు. మేము చెప్పనవసరం లేదు. మంత్రి గంటాకు ఇది మామూలే, ఒక చోట పూర్తయ్యాక మరో చోటు వెతుక్కుంటాడు. భీమిలి వెళ్లినపుడు చాలా తెలిశాయని అయన విమర్శించారు.