ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన నేపద్యం లో చమురు ధరలను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మరి నిజంగానే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తే.. ఆయా చమురు ధరలు ఎలా ఉంటాయి.. అసలు పన్నులు ఎలా వేస్తారు..? వీటిపై కొంతమేరకు స్పష్టతనిచ్చారు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చినా అవి పూర్తిస్థాయి జీఎస్‌టీ కిందకు రావని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ చమురును వస్తు, సేవల పన్ను పరిధిలోకి చేర్చితే.. గరిష్ఠంగా 28శాతం జీఎస్‌టీతో పాటు లోకల్ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ కూడా ఉండే అవకాశాలున్నాయన్నారు. అలా జరిగితే మళ్లీ ప్రస్తుతం ఉన్న ధరల మాదిరిగానే ఉంటుందన్నారు.‘ప్రపంచంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌పై పూర్తిస్థాయి జీఎస్‌టీ లేదు. అందుకే భారత్‌లోనూ జీఎస్‌టీతో పాటు వ్యాట్ కూడా ఉంటుంది’ అని సదరు అధికారి తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటేనే పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్‌టీ కిందకు చేర్చడం జరుగుతుందన్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ. 19.48, లీటర్ డీజిల్‌పై రూ. 15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తోంది. దీంతో పాటు రాష్ట్రాలు వ్యాట్‌ను కూడా విధిస్తున్నాయి. పెట్రోల్‌పై ఈ వ్యాట్ ముంబయిలో అత్యధికంగా 39.12శాతం, అండమాన్ అండ్ నికోబార్‌లో అత్యల్పంగా 6శాతం ఉంది. ఇక డీజిల్‌పై తెలంగాణలో అత్యధికంగా 26శాతం ఉంది. మొత్తం పన్నులు కలిపి పెట్రోల్‌పై 45 నుంచి 50శాతం, డీజిల్‌పై 35 నుంచి 40శాతం ఉన్నాయి. జీఎస్‌టీలోకి చేర్చితే కూడా దాదాపు ఇదే స్థాయిలో పన్నులు ఉంటాయని సదరు ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.