నైరుతి రుతుపవనాల రాకతో కర్నూలు రైతులు సాగు చర్యల్లో నిమగ్నమయ్యారు. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు మొదలయ్యాయి. ఇదిలాఉంటే జిల్లాలో అత్యధికంగా వేరుశనగ సాగు సాగువుతుంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగులో వేరుశనగ లక్ష హెక్టార్లకు పైగా సాగు చేస్తారు. దీనికి తగ్గుట్టుగానే రైతులకు విత్తనం కూడా అంతే మొత్తంలో అందాల్సి ఉంది. దాదాపు లక్ష క్వింటాళ్ళ విత్తనం అవసరం కాగా ప్రస్తుతం వ్యవసాయశాఖ 40 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీకి సిద్దం చేసిందని రైతులు అంటున్నారు. జిల్లాలో 5 ఎకరాలలోపు ఉన్న కర్షకులను ప్రభుత్వం చిన్నకారు రైతులుగా గుర్తించింది. అయితే వేరుశనగ పంట సాగును 5 ఎకరాల భూమిలో ఎలా సాగు చేసేదని చిన్నకారు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలకు సరిపడా విత్తన పంపిణీ జరగకపోవడమే దీనికి కారణం. వ్యవసాయ శాఖ ఒక్కో రైతుకు 2 ఎకరాలకు సరిపడా 120 కేజీలు మాత్రమే పంపిణీ చేస్తోంది. మిగతా 3 ఎకరాలకు రైతులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అసలే అప్పుల్లో ఉన్న రైతులు రుణాలు దొరకక నానాపాట్లు పడుతున్నారు. ఇక విత్తన రాయితీ కూడా సరిగాలేకపోవడం ఆర్ధికంగా భారమే అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం తరపున సరిపడా విత్తనాలు అందక చిన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు ప్రవేటు వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. వ్యవసాయ శాఖ రాయితీ విత్తనాలను ఎపి సీడ్స్ ద్వారా 30 వేల క్వింటాళ్లు, ఆయిల్‌ఫెడ్ ద్వారా 10 వేల క్వింటాళ్లు సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా 51 పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటివరకూ 20137 వేల క్వింటాళ్లను పంపిణీ చేశారు. అయితే ఈ విత్తనాలు నాసిరకంతోపాటు అధికంగా పుల్లలు, చెత్తచెదారం ఉండడంతో రైతులు తీసుకోవడానికి ఇష్టపడడంలేదు. సాగుకు పనికొచ్చే విత్తనం సరిగ్గా లేకుంటే దిగుబడులు ఆశించినంత రావని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సరిగాలేని విత్తనాలను అధికారులు సైతం వెనక్కు పంపుతున్నారని సమాచారం. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో రైతన్నల్లో నిరాశ వెల్లువెత్తుతోంది. విత్తనాల కోసం నెల రోజులుగా తిరుగుతున్నా ఫలితం ఉండడంలేదని పలువురు రైతులు వాపోతున్నారు. వాస్తవానికి భూమిలో తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలి. సమయం లేకపోవడంతో ప్రవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి వేరుశనగ సాగుకు సిద్దమవుతున్నారు చాలామంది రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి జిల్లా అవసరాలకు సరిపడా.. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని అంతా కోరుతున్నారు.