2014లో.. బీజేపీకి అఖండ విజయం కట్టబెట్టారు నరేంద్ర మోడీ. ఇప్పుడు అదే మోడీ.. పార్టీకి మైనస్ గా మారారని కాషాయవర్గం భావిస్తోంది. ఆర్ఎస్ఎస్ అయితే.. మోడీకి కచ్చితంగా నో చెప్పేస్తోంది.వచ్చే ఎన్నికల్లో.. పార్టీ ఏదైనా.. ప్రధానిని నిర్ణయించగల బలం తమకు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత.. చంద్రబాబునాయుడు చాలాకాలం క్రితమే స్పష్టంచేశారు. నెక్స్ట్ టైమ్ ప్రధానిగా నరేంద్ర మోడీకి ఛాన్స్ ఇవ్వకూడదన్న భావన ఆయన మాటల్లో ప్రతిధ్వనించింది. ఇలాంటి అభిప్రాయమే దేశవ్యాప్తంగా అనేక పార్టీల్లో నెలకొంది. అంతేకాదు.. మోడీ సొంత పార్టీ.. బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్..ఆర్ఎస్ఎస్ లోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది. మోడీకి మరోసారి ప్రధానిగా ఛాన్స్ ఇవ్వకూడదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల్లో ఓ వర్గం పట్టుబడుతోంది. బీజేపీని దేశంలో తిరుగులేని పార్టీగా మార్చిన ఘనత నరేంద్ర మోడీదే. అయితే.. ఆయన ధోరణి పార్టీకి చేటు తెచ్చేదిగా ఉందని సీనియర్లతో పాటూ.. ఆర్ఎస్ఎస్ లోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. దీంతో మోడీని దూరం పెట్టే విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ-అమిత్ షాలు ఉన్నపాటున దిద్దుబాటు చర్యలు మొదలెట్టారని పరిశీలకులు అంటున్నారు. అద్వానీ లాంటి సీనియర్లనే కాక మిత్రపక్షాలు, సెలబ్రిటీలను కలిసే కార్యక్రమం ప్రారంభించడానికి అంతర్గతంగా తీవ్రమవుతున్న అసంతృప్తే కారణమని చెప్తున్నారు. దేశంలో ప్రస్తుత.. రాజకీయ పరిస్థితి పరిశీలిస్తే.. మోడీ పట్ల వ్యతిరేకత హై రేంజ్ లో ఉంది. ఆయనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు, మమతాబెనర్జీ లాంటివారు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా బీజేపీయేతర పక్షం ఏకం కావాలని పిలుపునిస్తూ.. దూసుకుపోతోంది. ఈ ఎఫెక్ట్ ఇటీవలి ఉప ఎన్నికలపై పడింది. బీజేపీ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయినట్లైంది. 2014లో కాంగ్రెస్‌ను అధికారం నుంచి దించేందుకు ఇతర పార్టీలు ఏకమైనట్లే, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని గద్దె దించేందుకు ఇతర పార్టీలన్నీ చేతులు కలుపుతున్నాయి. సిపిఎం, తృణమూల్ లాంటి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పార్టీలు కూడా విబేధాలు పక్కనపెట్టి మోడీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ఇక వీరు బీజేపీ దారుణంగా మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డైరక్షన్ లో అడుగులేస్తుండడంతో కమలంపార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. నాలుగేళ్లలోనే తమ పార్టీపై ఇంత వ్యతిరేకత వెల్లువెత్తడంతో కమలనాథుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పార్టీ భవిత కోసం.. మోడీని పక్కన పెట్టేయడమే మంచిదని పలువురు నేతలు భావిస్తున్నారు.రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఎదుర్కొనే విషయంలోనూ బీజేపీ తీరుపై ఆరెస్సెస్ అసంతృప్తిగా ఉంది. కొన్ని రోజుల క్రితం హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో బీజేపీ, ఆరెస్సెస్ నేతలు సమావేశమయ్యారు. మూడు రోజులపాటు జరిగిన సమావేశాల్లో పార్టీ భవిత, 2019 ఎన్నికల వ్యూహాల అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ వచ్చినా రాకున్నా.. మోడీ మాత్రం ప్రధాని కారాదని పలువురు పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2014 నుంచి 2017 వరకూ.. జరిగిన వివిధ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మోడీ వల్లే అఖండ విజయాలు నమోదు చేసింది ఆ పార్టీ. అయితే.. ఈ మానియాను కంటిన్యూ చేయడంలో మోడీ విఫలమయ్యారు. ఒంటెద్దు పోకడలతో రాజకీయంగానే కాక పాలనాపరంగానూ విమర్శలపాలయ్యారు. కొందరైతే మోడీ నియంతగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సైతం చేస్తున్నారు. మొత్తంగా ఈ ఆరోపణలు, విమర్శలు.. ఎఫెక్ట్ బీజేపీపైనే పడుతోంది. అందుకే.. మోడీకి గుడ్ బై చెప్పేయాలని కాషాయదళంలోని కొందరు స్పష్టంచేస్తున్నారు.