YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆగని ఇసుక దందా..!!

 ఆగని ఇసుక దందా..!!
నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి, పెన్నానదుల్లో గతంలో ఉన్న ఇసుక తవ్వకాల లీజులను ప్రభుత్వం 2015లో రద్దు చేసి రేవుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా మహిళల పరిధిలో ఉన్న సంఘ బంధం సభ్యులకు అప్పగించడం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నెల్లూరు, గ్రామీణ, పట్టణ మండలాలతోపాటు బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, సంగం, పొదలకూరు, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం, కలువాయి, గూడూరు, సైదాపురం, కోట, వాకాడు, నాయుడుపేట, సూళ్లూరుపేట, అనంతసాగరం, సంగం మండలాల్లో 48 రీచ్‌లను గుర్తించి రెండు క్యూబిక్‌ మీటర్ల ఇసుకను రూ.వెయ్యికి విక్రయించేలా నిర్ణయించింది. ఇందుకుగాను రీచ్‌ల వద్ద రోడ్లు, షెడ్లు, కంప్యూటర్ల ఏర్పాటుకుగాను రూ.39 లక్షలు ఖర్చు చేసి వసతులు ఏర్పాటు చేశారు. కొంత కాలం ఈ విధానం సాఫీగా సాగింది. ఆరునెలల వ్యవధిలో ఇసుక అమ్మకాల ద్వారా స్థానికసంస్థలకు సీనరేజీ రూపేణా రూ.82 లక్షల వరకు రాబడి వచ్చింది. స్థానిక వనరుల ద్వారా ఉచితంగా లభించే ఇసుకను కూడ ప్రభుత్వం క్యూబిక్‌ మీటర్‌ రూ.500 వరకు విక్రయించడం అప్పట్లో నిరుపేద గృహనిర్మాణదారులకు ఇబ్బందికరంగా మారింది.ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణాకు అలవాటుపడిన కొందరు మాఫియా నేతలు ఇక్కడ రేవుల్లో ట్రాక్టర్‌ ఇసుకను రూ.వెయ్యికి కొనుగోలు చేసి లారీల్లో పొరుగు రాష్ట్రాలకు తరలించి అక్కడ ట్రాక్టర్‌ ఇసుకను రూ.7000 వరకు విక్రయించడం జరిగింది. పారిశ్రామిక సంస్థలకు ఇదే తరహాలో విక్రయాలు జరుపుతున్నారు. ఇదికాకుండా మండల స్థాయిలో ఉన్న ఇసుక మాఫియా నేతలు కొందరు సంఘబంధాలకు చెందిన వారిని తమ కనుసన్నల్లో ఉంచుకొని ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. ఇలా ఇసుక విక్రయాల్లో లొసుగులు గుర్తించిన ప్రభుత్వం ఏడాదికే ఈ విధానాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్థానిక అవసరాలకు ప్రభుత్వం నిర్ణయించిన రేవుల నుంచి నిర్మాణదారులు ఇసుకను ఉచితంగా తీసుకొనేలా నిర్ణయించారు. తవ్వకాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు అప్పగించడం జరిగింది. లబ్ధిదారులకు ఇసుకను సరఫరా చేసే ట్రాక్టర్లకు తప్పనిసరిగా జీపీఏస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కా జిల్లాలు, రాష్ట్రాలకు తరలిపోకుండా కొన్నిచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్మాణ రంగంలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను అవకాశంగా తీసుకొని కొందరు మాఫియా నేతలు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా ఇతర ప్రాంతాలకు జోరుగా రవాణా చేశారు. రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం ఎక్కువ సమయం ఈ అక్రమ రవాణాపైన దృష్టి సారించాల్సి వచ్చింది.

Related Posts