YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈ హత్యతో కేసీఆర్ నిజ రూపం బయటపడింది

ఈ హత్యతో కేసీఆర్ నిజ రూపం బయటపడింది

 - కాంగ్రెస్ గెలుస్తుందనే  హత్యారాజకీయాలు

- శ్రీనివాస్ హత్య నివేదికపై కోమటిరెడ్డి ఆగ్రహం

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. మిర్చి బండి దగ్గర కొట్లాట వల్లే నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేశారన్న నివేదికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. షీ టీమ్‌లంటూనే మహిళలను రాష్ట్ర ప్రభుత్వం విధవలుగా మారుస్తోందని ఆరోపించారు. తెలంగాణ బెస్ట్ పోలీస్ అని చెప్పుకోవడం మానుకోవాలని అన్నారు. ఈ హత్యతో ముఖ్యమంత్రి ఎంత రాక్షసుడో ప్రజలకు కూడా తెలిసిపోయిందని, త్వరలోనే ఆయనకు కూడా ప్రజా కోర్టులో శిక్షపడేలా చూస్తామని హెచ్చరించారు. పదవులు శాశ్వతం కాదని సీఎం కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలని, ఇప్పటికైనా కాస్తంత నైతికత అనేది ఉంటే శ్రీనివాస్ హత్య కేసును సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని, తద్వారా ఆ హత్యలో సీఎం కేసీఆర్ పాత్ర లేదని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మేల్యే, డీఎస్పీ పాత్రేంటో త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. కాబట్టి అందులో తన పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత సీఎందేనన్నారు.

ఈ హత్య విషయంలో నల్గొండ ఎస్పీ అడ్డంగా దొరికిపోయారని, మర్డర్ కేసుపై విలేకరులు ప్రశ్నలు వేస్తే ప్రెస్ నోట్ చదువుకోండి అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారని ఆరోపించారు. అంటే సీఎం ఆఫీసు నుంచి వచ్చిన ప్రెస్‌నోట్‌నే ఎస్పీ చదివారని ఆరోపించారు. కాబట్టి సీఎం కేసీఆర్ ఈ హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. లేకపోతే ఈ హత్యకు సీఎం పరోక్షంగా సహకరించారని ప్రజలు కూడా నమ్మాల్సి వస్తుందన్నారు. హత్యలో హస్తం లేదనుకుంటే కేసును సీబీఐకి బదిలీ చేయించాలని డిమాండ్ చేశారు. హత్యపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్‌తో హైకోర్టుకు వెళుతున్నామని, ఈ హత్య కేసును దేశవ్యా్ప్తంగా తీసుకెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని చెప్పారు. 

రంగ హత్యతో టీడీపీ ఎలా కూలిపోయిందో..
‘‘మీ దోపిడీ రాజ్యానికి, వేరే పార్టీల నేతలను చంపడం కోసం టీఆర్ఎస్‌కు పోలీసు యంత్రాంగం పనికొస్తుందనడానికి ఇది కేవలం ఉదాహరణ కాదు. కేసీఆర్.. ఈ ఘటనతోనే మీ ప్రభుత్వానికి చివరి రోజు వస్తుంది. ఆ రోజు విజయవాడలో నిరాహార దీక్షలో ఉన్న వంగవీటి రంగ హత్యతో.. టీడీపీ ప్రభుత్వం ఎలా అయితే కూలిపోయిందో అలాగే కూలిపోతుంది’’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని పిలిపించి మరీ హత్య చేశారని, దానిపై డీజీపీకి ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఇచ్చిన ఫిర్యాదును కనీసం చదవనైనా చదవలేదని, ఓ హామీ అంటూ ఏదీ ఇవ్వలేదని, మంచిది అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్‌కు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఫాం హౌస్‌లో కూర్చున్నారని ఆరోపించారు. దేశంలో కొత్తగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో తలలు, మొండాలు వేరుచేస్తున్న పైశాచిక ఘటనలతో సభ్య సమాజం బాధపడాల్సిన రోజులొచ్చాయని మండిపడ్డారు.

సెక్రటేరియట్‌కు రాకుండా కేవలం ఫాం హౌస్‌లోనే సీఎం కేసీఆర్ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం రోజు, మరో రెండు రోజుల పాటు మాత్రమే సీఎం కనిపించారని, ఆ విషయంపై మీడియా కూడా స్పందించట్లేదని, ఆయన ఫాం హౌస్‌లో ఉన్నారా, ప్రగతి భవన్‌లో ఉన్నారా అన్న విషయం ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. ఒకాయన ఫాం హౌస్‌లో ఉంటే మరో ఆయన, కేటీఆర్ విదేశాల్లో తిరుగుతున్నారని, ఇక, మూడో పవర్ అయిన కవిత కనిపించక రెండు నెలలు అవుతోందని అన్నారు. ఇలా ప్రజలకు దగ్గరగా లేకుండా దోచుకున్నవి దాచుకునేందుకు బిజీబిజీగా గడుపుతున్నారని, అమాయకులను బలి చేసేందుకు తెలంగాణ పోలీసులను వాడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ హత్యపై రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినా డీజీపీ ఇప్పటిదాకా స్పందించలేదని అన్నారు. 

చిరుమర్తి లింగయ్యనూ చంపేస్తారు..
నేర చరిత్ర ఉన్న వేముల వీరేశం.. ఆయనపై 2000 ఓట్లతో ఓడిపోయిన చిరుమర్తి లింగయ్యను కూడా హత్య చేస్తాడని, ఏం చేసినా ముఖ్యమంత్రి మద్దతు తనకు ఉందన్న ఆలోచనతో వీరేశం బరితెగించాడని ఆరోపించారు. చిరుమర్తి లింగయ్యను నెలో, లేదంటే రెండు నెలల్లోనో వేముల వీరేశం హత్య చేస్తాడని ఆయన చెప్పారు. తనకు రైట్ హ్యాండ్‌ను హత్య చేస్తేనే.. సింపుల్ విషయం అని తేల్చేసి కేసును నీరుగార్చారని మండిపడ్డారు. క్షణికావేశంలోనే హత్య జరిగిందని కట్టుకథ అల్లేశారని, తొలుత శ్రీనివాసే.. రాంబాబు అనే వ్యక్తి గొంతు పట్టుకున్నాడని తేల్చి చెప్పారని, అదేమైనా వాళ్లు చూశారా అని ప్రశ్నించారు. హత్య చేసిన వారిని బయటపడేసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారని ఆయన ఆరోపించారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన నిందితులు 8 మంది పెళ్లికొడుకుల్లా తయారై వచ్చారని, వాళ్లను అసలు పోలీసులు విచారించారా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అండగా పెట్టుకుని ప్రత్యర్థులను హత్యచేస్తూ కేసీఆర్ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేపు చిరుమర్తి లింగయ్యను, ఆ తర్వాత ఇంకొకరిని చంపేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్‌కు వేముల వీరేశం అనుచరుల ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా పట్టించుకోలేదని, హత్యకు రెండు మూడు రోజుల ముందు కూడా ఎస్పీని కలిసి భద్రత అడిగితే ఇస్తామన్నారని, ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ భద్రత ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు చిరుమర్తి లింగయ్యకు కూడా అలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దానిపై నంబర్లతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. దానిపైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని, దానర్థం లింగయ్యను వేముల వీరేశం చంపాలనే కదా అని అన్నారు. లింగయ్య ఇప్పుడు గెలిచే స్థితిలో ఉన్నాడు కాబట్టి.. ఆయన్ను చంపేస్తే మళ్లీ వీరేశమే గెలుస్తాడు కాబట్టి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని, బయటివాళ్లు రాకుండా ఇలా హత్యారాజకీయాలకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. గ్రామ మస్కూరు కొడుకు ఎమ్మెల్యే అవుతుంటే చూసి ఓర్వలేక హత్యకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డిలలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెప్పడంతోనే ఇలా హత్యలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. ఫాం హౌస్‌లో రహస్యంగా ఉంటూ వెనక ఉండి ఈ హత్యలను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 

Related Posts