ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడి అందరెరిగినదే. బహుళ జనాభా కలిగి, పేదరికం అధికంగా ఉన్న మనదేశంలో ఆరోగ్యపరమైన అంశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది. ఈనాడు అనేక వైద్య విధానాలు అమలులో ఉన్నాయి. ఈ వైద్యవిధానాలన్నింటిలో అధునాతన వైద్యవిధానం హోమియోపతే.
దీనిని ఆవిష్కరించింది శామ్యూల్ హానిమన్. జర్మనీ దేశస్థుడు. అల్లోపతి వైద్యంలో ఎమ్.డి పట్టభద్రుడు. 18వ శతాబ్దంలో ప్రాణాంతకంగా పరిణమించి, తీవ్రంగా విజృంభించిన మలేరియా జ్వరానికి వాడే క్వైనాను తనపై ప్రయోగించి 1790లో ఈ వైద్యవిధానాన్ని కనిపెట్టడం జరిగింది.
వైద్యరంగంలో అత్యద్భుతమైన సంఘటనలు రెండే రెండు. మొట్టమొదటిది వ్యాధిని పరిశీలనాంశంగా పరిగణించి వైద్యరంగాన్ని మూఢవిశ్వాసాల నుంచి ఉద్ధరించడం. ఇందుకు కారకులు గ్రీసు దేశస్థులు ‘హిప్పోక్రాటీస్’ కారకులుఅని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనను ఆధునిక వైద్య పితామహునిగా పరిగణించడం జరుగుతుంది. రెండవది ఔషధ చర్యను పరిశీలనాంశంగా పరిగణించి ప్రయోగాత్మకంగా ఔషధ ధర్మాలను రాబట్టడం.
1790లో సింకోనా ఔషధాన్ని స్వయంగా తనపై ప్రయోగించి ఔషధ ధర్మాలను రాబట్టి చికిత్సా నియమాన్ని కనిపెట్టడం.
‘Likes cure likes’ అదే సారూప్యతే నియమం.
చికిత్సారంగం ఈ నియమావిష్కరణతో శాస్త్రీయత సంతరించుకున్నట్లవుతుంది. హోమియో వైద్యవిధానం ఈ నియమాన్ని పాటిస్తుంది. అధునిక వైద్యవిధానాన్ని వ్యాధినిరోధక టీకాల ద్వారా అమలు చేస్తున్నారు. ఈ నియమానుసారంగా ఔషధాలను వాడి వ్యాధులను నివారించడం జరుగుతుంది.
సారూప్యతా నియమానుసారంగా ఔషధాలను ప్రయోగించడమే గాక.. సూక్ష్మమోతాదులో ఔషధాలను ప్రయోగించడం హోమియో ప్రత్యేకత. సారూప్యతా సూత్రం హానిమన్ కన్న ముందే హిప్పోక్రాటీసు కూడా తెలిపినా, సూక్ష్మమోతాదులు మాత్రం హానిమన్ గుర్తించిన అంశం. సూక్ష్మమోతాదులను పొటెన్సీలని వ్యవహరిస్తారు. వ్యాధిగ్రస్తుడు : జీవపరిణామంలో జంతుదశవరకు జన్యువులే జీవధర్మాలకు మూలంగా నిలుస్తాయి. జీవపరిణామం మానవదశకు చేరుకునే సరికి మెదడులో ఉత్పత్తయ్యే న్యూరో ట్రాన్స్ మీటర్లు ప్రాధాన్యత సంతరించుకొంటాయి. ఇవే జీవ ధర్మాలను శాసిస్తున్నాయి కూడా. ఆవేశాలు, ఆలోచనలు వంటి భావోద్వేగాలు మానవులకు ప్రత్యేకం. అందుకే చికిత్స వ్యాధి, ఔషధం అనే రెండు అంశాలకు మాత్రమే పరిమితం కాకుండా.. రోగి, రోగం, ఔషధం అన్న మూడు అంశాలకు వర్తింప జేయాలి. అందుకే హోమియో వైద్యవిధానంలో ఔషధం ఎంపిక రోగిపరంగా విశ్లేషించడం జరుగుతుంది. ఔషధాలను రోగిపరంగా విశ్లేషించి చికిత్స జరగడం మూలంగానే రోగి వ్యాధినిరోధక శక్తి ఇనుమడించి శాశ్వతంగా నివారించడం సాధ్యమవుతుంది. ఔషధాల ఎంపిక : మనిషిలో మూడు అంశాలున్నాయి. ప్రాణం, మనస్సు, దేహాలు. ఔషధాల ఎంపిక రోగపరంగా కాక, రోగి పరంగా విశ్లేషించాలన్నది హోమియో వైద్య అవగాహన. వ్యాధి దశలను పరిశీలిస్తే ప్రాణశక్తిలో మార్పులు మొదటిదశ. మానసిక స్థాయిలో మార్పులు రెండోదశ. చివర దశలో దేహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే రోగి ‘నా ప్రాణం బాగోలేదు’ అనే దశలో దేహంలో మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. అందుకే హోమియో ఔషధాల ఎంపికలో ప్రాణ, మానసిక స్థాయిలలో అంశాలను గూడా, హోమియో వైద్యంలో, పరిగణనలోకి తీసుకొనడం జరుగుతుంది. అందుకే ఔషధ ధర్మ నిర్ధారణకు మానవులపైనే ప్రయోగాలు జరపాలంటాడు హానిమన్.