YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బలిదానాలు చేస్తేనే ఉక్కు పరిశ్రమ ఇస్తారా? మెకాన్ నివేదిక బయటపెట్టాలి : మంత్రుల డిమాండ్ రాష్ట్ర బీజేపీ నేతలపై మంత్రుల ఫైర్

బలిదానాలు చేస్తేనే ఉక్కు పరిశ్రమ ఇస్తారా? మెకాన్ నివేదిక బయటపెట్టాలి : మంత్రుల డిమాండ్        రాష్ట్ర బీజేపీ నేతలపై మంత్రుల ఫైర్
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు విశాఖ ఉక్కు ఉద్యమం మాదిరిగా బలిదానాలు కోరుంటున్నారా? అని కేంద్ర ప్రభుత్వ పెద్దలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు నిలదీశారు. కుంటిసాకులు మానేసి, బలిదానాలకు తావులేకుండా పార్లమెంట్ లో చేసిన పునర్విభజన చట్టాన్ని అనుసరించి తక్షణమే కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణిని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టే దుర్బుద్ధిని మానుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు వారు హితవు పలికారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కుటుంబరావుతో కలిసి వారు మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఉక్కు పరిశ్రమ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు వెదుకుతోందన్నారు. తప్పంతా ఏపీదేనంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూస్తోందన్నారు. ఎన్డీయే హయాంలో టీడీపీ ఉన్నంత వరకూ కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామంటూ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు సైతం ప్రకటిస్తూ వచ్చారన్నారు. తాము ఎన్డీయే నుంచి బయటకొచ్చిన తరవాత రాయలసీమ డిక్లరేషన్ ను బీజేపీ నేతలు ప్రకటించారన్నారు. వారికి రాయలసీమ డిక్లరేషన్ మాట్లాడే హక్కులేదన్నారు. ఈ ఏడాది జనవరి 6న మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కడప వచ్చి, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని పరిశీలించిందన్నారు. 7,8 తేదీల్లో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమి, విద్యుత్, నీరు,రవాణా ఇలా అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. 9 తేదీన ఇందుకు సంబంధించిన వివరాలు టాస్క్ ఫోర్స్ కు అందజేశామన్నారు. ఇంత చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అవకాశం ఉన్నా, లాభదాయకం కాదంటూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందన్నారు. 2014 తరవాత స్టీల్ రేట్లు 40 నుంచి 60 శాతం వరకూ పెరుగుతూ వచ్చాయన్నారు. ప్రైవేటు రంగంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎందరో పెట్టుబడుదారులు ముందుకొస్తున్నారన్నారు. ఇటీవలే సీఎం చంద్రబాబునాయుడు స్టీల్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించారన్నారు. అలాగే, మూతపడిపోయిన స్టీల్ ఇండస్ట్రీస్ ను ప్రారంభించడానికి ఎన్నో సంస్థలు ముందకొస్తున్నాయన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకురాకపోవడం దారుణమన్నారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే, కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసికారు. ఏపీ ప్రజల పట్ల బీజేపీకి ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు. ఓట్లు, సీట్లు రావనే ఏపీ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించడం సరికాదని హితవు పలికారు.

Related Posts