YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

నాణ్యతకు చెల్లుచీటి!

నాణ్యతకు చెల్లుచీటి!
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒక ఔట్‌డోర్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. సర్కార్ ఆదేశాలతో స్పోర్ట్స్‌ అథారిటి నుంచి నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలానికి2017లో రూ.3.6 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో దేవరకొండ మండలం తాటికోల్‌రోడ్డులో ఉన్న పెంచికల్‌పహాడ్‌ గ్రామం వద్ద ఔట్‌డోర్‌ స్టేడియం నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు. అయితే ఈ పనులు వేగవంతం చేసి క్రీడామైదానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంట్రాక్టర్ ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదని క్రీడాకారులు అంటున్నారు. ఏడాదిగా పనులు నత్తనడకన సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో జాప్యమే కాక నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలను అధికారులు పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో క్రీడాకారులతో పాటూ స్థానికులూ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పర్యవేక్షణ అధికారులు తక్షణమే స్పందించి రూ.కోట్లతో నిర్మితమవుతున్న స్టేడియంలో నాణ్యతాలోపాలు లేకుండా చూడాలని స్పష్టంచేస్తున్నారు.
 
స్టేడియంలో క్రీడాకారులు లోనికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద పనులు చేపడుతున్నారు. అంతకుముందే క్రీడాకారుల విశ్రాంతి గదులు కొంతభాగం నిర్మించారు. దాదాపు ఐదు ఎకరాల్లో స్టేడియం పక్కన కుంటశిఖం ఉంది. కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు తమ భూమి అంటూ తరచూ ఘర్షణకు దిగుతున్నారు. దీంతో ప్రస్తుతం 3.5 ఎకరాల్లోనే నిర్మాణం పనులు చేస్తున్నారు. దాదాపు ఎకరంన్నర స్థలంలో క్రికెట్‌ ఆడుకునేందుకు మైదానం కోసం మొరంతో చదును చేసి బెడ్‌ తరహాలో నిర్మాణం చేపట్టాలి. అయితే ఈ పనుల్లో పురోగతి లేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు మట్టితో చేస్తున్న పనులు సైతం నాణ్యంగా లేవని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక నిర్మాణాల్లో తక్కువ సిమెంట్‌ తక్కువ, ఇసుక ఎక్కువగా వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. పని ప్రదేశంలో సిమెంట్‌ బస్తాలను ఎక్కడపడితే అక్కడ నిల్వచేస్తున్నారు. పనులు చేసేటప్పుడు వాటిని మరోచోటికి తరలించటంలేదు. సిమెంట్‌ సంచులను ఇష్టారాజ్యంగా గోడల్లోనే ఉంచి నిర్మిస్తున్నారు. ప్రభుత్వ పనుల్లో ఈ తరహా లోపాలు జరుగుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికార యంత్రాంగం సత్వరమే స్పందించి స్టేడియం పనులు పటిష్టంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts