YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పట్టణాలకేసి చూస్తున్న వ్యవసాయదారులు..

 పట్టణాలకేసి చూస్తున్న వ్యవసాయదారులు..

- వ్యవసాయం అంటేనే బెంబేలెత్తిపోతున్నరైతు ..

- అన్నదాతలు ఆందోళన బాటలో అన్నదాతలు..

మారుతున్న పల్లె యువత ధోరణి.. 

వ్యవసాయం అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికులు సహజంగా వారి సొంత భూముల్లో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారనేది మన దేశంలో సర్వసాధారణం. కానీ ఇటీవలి పరిణామాలు చూస్తే ఆరుగాలం కష్టించినా ఫలితం అందుతుందన్న నమ్మకం లేదు. చేతికి అందిన ఫలితానికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశలు నానాటికి జావగారిపోతున్నాయి. ఈ వాస్తవ నేపథ్యంలో వార్షిక విద్యా స్థాయీ నివేదిక 2017ను స్వచ్ఛంద సంస్థ ప్రధాన్‌ వెల్లడించింది. ఈ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే ... పల్లె ప్రాంతాల్లోని 14 - 18 ఏండ్ల మధ్య వయస్కులలో 42 శాతం మంది ఏదో ఒక పనిచేస్తూన్నారు. వాళ్ల పేర్లు బడుల్లో ఉన్నా లేకున్నా వారంతా ఏదో రకమైన పనులు చేస్తున్నారు. వారిలో కూడా 79 శాతం మంది వ్యవసాయం పనుల్లోనే గడుపుతున్నారు. 28 రాష్ట్రాలలో సర్వే చేయగా 30 వేల మంది తమ సొంత పొలాల్లోనే పనిచేస్తున్నారు. సర్వే చేసిన వారిలో కేవలం 1.2 శాతం మాత్రమే వ్యవసాయదారుగా కొనసాగేందుకు ఆసక్తి కనబరిచారు. 18 శాతం మంది సైన్యంలో కానీ, పోలీసు దళాల్లో కానీ పనిచేయాలనుకుంటున్నారు. 12 శాతం మంది ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు. ఇక యువతుల్లో ఎక్కువ మంది (25 శాతం) టీచర్‌ లేదా డాక్టర్‌ లేదా నర్సు (18 శాతం) ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నారు. ఇక యువకుల్లో 13 శాతం, యువతుల్లో 9 శాతం మంది ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగమైనా సై అంటున్నారు. 


వివిధ రాష్ట్రాల్లో అన్నదాతలు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. గిట్టుబాటు ధరల కోసం, రుణాల మాఫీ కోసం వారంతా ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో వెలువడిన ఈ సర్వే ప్రకారం - వ్యవసాయ రంగ పురోగతి 2014-15తో పోల్చి చూస్తే 2017-18 నాటికి కేవలం ఏడాదికి రెండు శాతం మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వివరాలు తెలియజేస్తూ, అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి విద్యలో వ్యవసాయ, పశు సంవర్థక కోర్సుల్లో ప్రవేశాలు చాలా స్వల్పంగా ఉన్నట్టు ప్రధాన్‌ వ్యవస్థాపక చైర్మెన్‌ మాధవ్‌ చవాన్‌ తెలిపారు. వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మిక శక్తిదాదాపు సగం తగ్గిపోయిందని అంటూనే, విద్యావంతులు వ్యవసాయం చేపట్టటం ఇప్పుడు ప్రయోజనకరమని ఆయన సూచించారు. వ్యవసాయంలోను, తోటల పెంపకంలోను, పశు పోషణ రంగాంలోను, ఇతర అనుబంధ రంగాలలో శాస్త్రీయ పద్ధతుల్లో యాంత్రికీకరణ, అధిక దిగుబడి వంగడాలు వాడుకలోకి తీసుకురావటంతో పాటు లాభదాయకమైన డిమాండ్‌, మార్కెట్‌ సమకూర్చాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని అట్టడుగు స్థాయి ఉద్యోగికి నెలకు రూ. 22000 లభిస్తున్నప్పుడు వ్యవసాయం నమ్ముకుంటే కనీసం నెలకు రూ. 3800 కూడా భరోసా లేని పరిస్థితి ఉందని  వ్యవసాయ రంగ ఉద్యమనేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు. 

ఈ సర్వేలోని కొన్ని అంశాలను ప్రభుత్వ సంస్థ జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ విడుదల చేసిన 2013 లెక్కల ప్రకారం వ్యవసాయ రంగంలో ఆధారపడిన గ్రామీణ కుటుంబానికి నెలకు రూ. 6424 ఆదాయం మాత్రమే లభిస్తోందని, అందులో వ్యవసాయం, పశుపోషణ ద్వారా వచ్చే ఆదాయం కేవలం రూ. 3844 అని నిర్ధారణ అవుతోంది. సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ 2014 నాటి నివేదిక ప్రకారం మెరుగైన ఉపాధి మార్గం కోసం దాదాపు 60 శాతం వ్యవసాయదారులు పట్టణాలకేసి చూస్తున్నారు. తమ వారసులు కూడా వ్యవసాయంపైనే జీవించాలని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు కేవలం 18 శాతం సానుకూలంగా స్పందించారు.

Related Posts