కమల్ హాసన్ సుదీర్ఘ రాజకీయాలను కొనసాగించాలనుకుంటున్నారా? ఇప్పుడే అధికారం రాకపోయినా, భవిష్యత్తులో పార్టీ పటిష్టం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారా? కమల్ హాసన్ తమిళనాడులో ఇటీవల మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కమల్ రాజకీయ పార్టీని పెట్టకముందు నుంచి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన అనేకసార్లు ట్విట్టర్లో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీని కూడా పలుమార్లు టార్గెట్ చేశారు.తాజాగా ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సమావేశంలో ప్రియంకా వాద్రా కూడా పాల్గొనడం విశేషం. సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏదీ లేదని పైకి చెబుతున్నా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు కాబోతున్న మహాకూటమిపైనే వీరు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈరోజు సోనియాతో కూడా సమావేశమైన కమల్ పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. తమిళనాడులో కాంగ్రెస్ కు పెద్దగా నేతలూ లేరు. క్యాడర్ లేదు. అయినా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ నెట్టుకొస్తూనే ఉంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో డీఎంకేతో మిత్రత్వాన్ని నెరుపుతోంది.తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించిన తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడింది. ఈ శూన్యతను అందిపుచ్చుకోవడానికి కమల్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టారు. పార్టీ ప్రకటించకముందే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిసి వచ్చారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కూడా భేటీ అయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో మాటా మంతీ కలిపారు. తనదీ వామపక్ష భావజాలమని చెప్పారు. మక్కల్ నీది మయ్యమ్ ఆవిర్భావ సభకు కూడా క్రేజీవాల్ హాజరయ్యారు. ఇలా తొలి నుంచి కమల్ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు.కమల్ భేటీతో ఆయన పార్టీ కూడా మహాకూటమిలో భాగం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి కమల్, రజనీకాంత్ లు కలిస్తే వచ్చే ఎన్నికల్లో గెలిచి తమిళనాడును ఏలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రజనీకాంత్ కొంత భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కమల్ అనుమానిస్తున్నారు. అనుమానించడమే కాదు అనేకసార్లు బహిరంగంగానే కమల్ రజనీపై బీజేపీ సంబంధాలపై వ్యాఖ్యానించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీతో కమల్ నడిచే ప్రసక్తి లేదని చెబుతున్నారు. బీజేపీయేతర కూటమితో కలవాలన్నది కమల్ ఆలోచనగా ఉంది. ఇందుకోసమే కమల్ టెన్ జన్ పథ్ తో టచ్ లోఉన్నారన్నది టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.