ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ప్రతీ రాజకీయ పార్టీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. టీడీపీ సంక్షేమ పథకాలు, పోలవరం, పట్టిసీమ అంటూ అభివృద్ధి మంత్రంతో ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తుంటే.. అటు విపక్షాలు ప్రభుత్వం చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తుండగా, జనసేన అధినేత పవన్ ప్రజాపోరాట యాత్ర పేరిట బస్సు యాత్ర చేస్తున్నాడు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణలు రోజుకో రకంగా మారుతున్నాయి. దీంతో టీడీపీ ఎంపీ మరో సీఎం రమేష్ ఉద్యమానికి తెరలేపారు.కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం ఆమరణ దీక్షకు దిగారు.. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్షకు దిగారు. ముందుగా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు సీఎం రమేష్ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పోట్లదుర్తి నుంచి భారీ ర్యాలీతో కడప దీక్షా శిబిరానికి సీఎం రమేష్ చేరుకున్నారు. అసలు ఉన్నట్లుండి సీఎం రమేష్ దీక్ష ఎందుకు చేశారు..? దీని వెనక ఉన్న కారణం ఏంటి..? అనే ప్రశ్నలకు రాయలసీమలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. సీఎం రమేష్ వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని, ఆయన ఏ క్షణాన్నైనా ఆ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఈ వార్తలను ఖండించలేదని, దీనికి ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రమేష్‌ను పిలిచి చీవాట్లు పెట్టారని, అందుకే ఆయన తన నిజాయితీ నిరూపించుకునేందుకు దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నారని అక్కడ జోరుగా ప్రచారం జరిగింది. వాస్తవానికి ఇది ఎవరో పుట్టించిన పుకారు మాత్రమేనని టీడీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి